పవన్, కారుణ్య, రాకేష్, మహేంద్ర కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘ఏటీఎం వర్కింగ్’. డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్, శ్రావ్య ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించారు. కిశోరి బసిరెడ్డి, యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ బుధవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
బసిరెడ్డి మాట్లాడుతూ.. ”మార్చి 17న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా తీసిన సినిమా కాదు. మంచి ప్రేమకథా చిత్రం. పెద్దనోట్ల రద్దువల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని చూపించాం. ఏటీఎం నాట్ వర్కింగ్ అని మేం టైటిల్ పెడితే సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెప్పారు. మా టైటిల్ నుంచి ‘నాట్’ ను తొలగించమన్నారు. ఇది అవార్డు సినిమా కాదు” అని చెప్పారు.
యక్కలి రవీంద్రబాబు మాట్లాడుతూ.. ”2002 నుంచి డిజిక్వెస్ట్ తో కలిసి సినిమాలు చేస్తున్నాం. ఇది మేం కలిసి చేస్తున్న నాలుగో సినిమా. సినిమా పూర్తయినా సెన్సార్ కారణంగా విడుదలలో కాస్త జాప్యం జరిగింది. పూర్తి స్థాయి కామెడీ ఉంటుంది. మూడు పాటలుంటాయి. బర్నింగ్ పాయింట్‌తో తెరకెక్కించాం” అని తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ”125కోట్ల మంది భారతీయులు ఒక డేసిషన్ మీద ఇన్‌ఫ్లుయన్స్ అయిన ఇష్యూని తీసుకుని డాక్యుమెంట్ చేద్దామని సరదాగా ఈ సినిమా చేశాం. అంతేగానీ పొలిటికల్‌గా ఏదో అని కాదు. సెన్సార్ సభ్యులు ‘నాట్’ అనే పదాన్ని మా టైటిల్ నుంచి తొలగించారు. అయితే రియాలిటీ ఏంటో అందరికీ తెలుసు. మేం దేనికీ వ్యతిరేకం కాదు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను గురించి చెప్పాం. అనంత్, త్రిలోక్, మహేశ్ అనే ముగ్గురు కుర్రాళ్ల కథ ఇది. ఏటీఎం క్యూలో జరిగే కథను చూపించాం” అని తెలిపారు.