జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి.. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ చేపట్టిన నిరసన దీక్ష విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న అశ్వత్థామకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. గత మూడు రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. శనివారం తన నివాసంలో దీక్ష ప్రారంభించిన అశ్వత్థామరెడ్డిని పోలీసులు బలవంతంగా ఆదివారం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీక్ష విరమించాలని పోలీసులు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన వినకుండా కొనసాగించారు. కొద్దిసేపటి క్రితం అశ్వత్థామతో కోదండరాం దీక్ష విరమింపజేశారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పు ప్రతి వచ్చాక సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని. అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రేపటి ఆర్టీసీ కార్మికుల సడక్ బంద్ రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. సమ్మెపై తుది నిర్ణయాన్ని మంగళవారం సాయంత్రం ప్రకటిస్తామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.