నర్తనశాల సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని నాగశౌర్య హీరోగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. రమణతేజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సొంత బ్యానర్‌లో ఈ సినిమా నిర్మించాడు. అమ్మాయిల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోకు హిట్టు పడి చాలా కాలమే అయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి బలమైన స్క్రిప్ట్‌తో పాటు సందేశాత్మక చిత్రాన్ని అందించేందుకు స్యయంగా నాగశౌర్యనే కథా రచయితగా మారాడు. తన లవర్ బాయ్ ఇమేజ్‌ను పక్కకు పెట్టి ఫుల్ యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథ ‘అశ్వథ్థామ’ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో నాగశౌర్యకు యాక్షన్ అండ్ మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టిందా? మళ్లీ ఈ యువ హీరో హిట్ ట్రాక్ ఎక్కాడా? డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారా? అనేది చూడాలి.
కథ: నగరంలోని యువతులు మిస్సవడం.. రెండు మూడు రోజులు తర్వాత అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో కనిపించడం.. కొన్ని నెలల తర్వాత ఆ యువతులు గర్భవతులు కావడం.. చేసింది ఎవరో తెలీదు. కొంత మంది పాత్ర ధారులతో ఓ సూత్రధారి నిర్మించుకున్న పద్మ వ్యూహం లాంటి సామ్రాజ్యంలోకి అశ్వథ్థామ ప్రవేశిస్తాడు. పద్మవ్యూహంలోకి వెళ్లిన అశ్వథ్థామ చిక్కుకున్నాడా? లేక ఆ వ్యూహాన్ని ఛేదించాడా? శత్రు సంహారం జరిగిందా అనేదే అశ్వథ్థామ కథ.
గణ (నాగశౌర్య)కు కుటుంబం అన్నా తన చెల్లెలు ప్రియ అన్నా ఎంతో ఇష్టం. చెల్లెలు ప్రియ ఎప్పుడు కంటతడి పెట్టకుండా అండగా, ధైర్యంగా ఉంటానని గణ తన తల్లికి చిన్నప్పుడే మాటిస్తాడు మన హీరో. అయితే తన చెల్లి పెళ్లికి కొద్ది రోజుల ముందు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడాన్ని చూస్తాడు గణ. ఇందుకు గల కారణాలను తెలుసుకొని తన చెల్లి ప్రియకు బాసటగా నిలుస్తాడు. తన చెల్లితో పాటు ఇంకెదరో యువతులు ఇలాంటి ఘటనలే ఎదుర్కోవడాన్ని గణ తన ఇన్వెస్టిగేషన్‌లో తెలుసుకుంటాడు. ఇదంతా చేస్తుంది ఎవరు? నేహ (మెహరీన్)కు గణ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి డాక్టర్ మనోజ్‌కుమార్ (జిష్షు సేన్ గుప్తా), సత్య, పోసాని, తదితరలు ఎందుకు ఎంటర్ అవుతారు? చివరికి ఈ మిస్టరీ వెనుక ఉన్నది ఎవరో హీరో తెలుసుకుంటాడా? చివరికి ఏమైంది? అనేదే కథలోని అంశం.
నటీనటులు: ఈ సినిమా మొత్తాన్ని తన భుజలపై మోశాడు నాగశౌర్య . ఇప్పటివరకు ఉన్న లవర్ బాయ్ ఇమేజ్‌ను తొలగించుకునేందుకు ఈ పవర్ ఫుల్ యాక్షన్ చిత్రంలో ఫుల్ ఎనర్జీతో అద్భుతంగా నటించాడు నాగశౌర్య. యాక్షన్ సీన్స్‌లలో హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. తన శైలికి భిన్నంగా చేసిన ఈ సినిమాతో అటు మాస్ ఆడియన్స్‌ను సొంతం చేసుకోవడం గ్యారెంటీ. సినిమా మొదటి భాగంలో కొన్ని సీన్లలలో కాస్త క్లాస్ లుక్‌లో కనిపించినా.. ఆ తర్వాత ఫుల్ మాస్ అండ్ రఫ్ లుక్‌లో కనిపిస్తాడు శౌర్య. సైకో విలన్‌గా జిష్షు సేన్ గుప్తా కొన్ని చోట్ల భయపెట్టిస్తాడు. క్లాస్ అండ్ రిచ్ విలన్‌గా చక్కగా ఒదిగిపోయాడు.
హీరోయిన్ మెహరీన్‌కు ఈ సినిమాలో మంచి పాత్ర లభించినప్పటికీ హావభావాలు పలికించడంలో కొంచెం తడబడింది. అంతేకాకుండా తన పాత్రలో జీవించడం మరిచిపోయినట్టుగా అనిపిస్తుంది. ప్రిన్స్, నాగశౌర్య చెల్లెలి పాత్రలో కనిపించి అమ్మాయి స్వీచ్‌వేషన్‌ని బట్టి స్క్రీన్ పై వచ్చి పోతుంటారు. భారీ తారాగణం ఉన్నప్పటికీ కొన్ని సీన్లలో వచ్చిపోతుంటారు తప్ప కథకు వారు పెద్ద గుర్తింపు ఉండదు.
విశ్లేషణ: ఈ సినిమాకు ప్రధాన బలం కథ, కాన్సెప్ట్. దీంతో తెరపైనే కాకుండా తెరవెనక కూడా ప్రధాన హీరో నాగశౌర్యనే. ఇక హీరో అందించిన కథను దర్శకుడు రమణ తేజ చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. సినిమా ప్రారంభమైన తొలి పదిహేను నిమిషాల్లోనే అసలు కథలోకి ప్రవేశిస్తుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, నెక్ట్స్ ఏంజరుగుతుంది అనే ఆతృత సగటు ప్రేక్షకుడికి ఏర్పడే విధంగా ఫస్టాఫ్ సాగుతుంది. అయితే హీరోయిన్‌తో వచ్చే సన్నివేశాలు, పాటలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉంటాయి. ఇంటర్వెల్ వరకు బాగానే ఉన్న రెండో భాగం దర్శకుడు ఎలా తీస్తాడా? అనే అనుమానం అందరిలోనూ తలెత్తడం ఖాయం.
అయితే సెకండాఫ్‌లో కూడా కథను ఎక్కడా డీవియేట్ కాకుండా? అనవసర హంగుల జోలికి వెళ్లకుండా రెండో అర్థభాగాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్. ఈ విషయంలో దర్శకుడి ప్రతిభకు నూటికి నూరు మార్కులు వేయాల్సిందే. ఎలాంటి గందరగోళం లేకుండా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా అనిపిస్తాయి. అయితే అన్నా చెల్లెలి మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ అంతగా పండలేదు. ఇక అసలు సూత్రధారి ఎవరో కనిపెట్టిన హీరో.. చిన్న ఫైట్‌తో సినిమా ముగించడంతో సినిమా అయిపోయిందా అనే భావన సగటు ప్రేక్షుకడికి కలగడం ఖాయం. ‘గోపాల గోపాల’ సినిమాలో ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్‌తో సినిమా ఆరంభం అవడం ‘అశ్వథ్థామ’కు బూస్టప్‌ను ఇచ్చే అంశం.
హైలైట్స్ : కథ, కథనం
నాగశౌర్య నటన
డ్రాబ్యాక్స్ : కొన్ని సన్నివేశాలే
టైటిల్ : అశ్వథ్థామ
నటీనటులు: రనాగశౌర్య, మెహరీన్, ప్రిన్స్, సత్య, జిష్షు సేన్ గుప్తా, పోసాని కృష్ణమురళి, తదితరులు
దర్శకత్వం : రమణతేజ
నిర్మాత :ఉషా మూల్పూరి
సంగీతం : శ్రీచరణ్ పాకాల
చివరిగా : ‘అశ్వథ్థామ’ అందర్ని థ్రిల్ చేస్తాడు
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)