బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నేడు 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరి అర్పితా ఖాన్.. సల్మాన్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇంతకీ ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే.. ఓ పండంటి ఆడబిడ్డకు అర్పిత జన్మనిచ్చారు. ఈ మేరకు అర్పితా ఖాన్ భర్త ఆయుష్ శర్మ సోషల్‌మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. తమ చిన్నారికి అయాత్ అనే పేరు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ‘మా ఇంటి యువరాణి వచ్చేసింది. అయాత్ శర్మ డిసెంబర్ 27న జన్మించింది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని ఆయుష్ పోస్ట్ చేశారు.
ఒకపక్క సల్మాన్ పుట్టినరోజు, మరోపక్క అర్పితా ఖాన్ పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో సల్మాన్ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. సల్మాన్ పుట్టినరోజు నాడే బిడ్డకు జన్మనివ్వాలని అర్పితా ఖాన్ దంపతులు భావించినట్లు సన్నిహితులు తెలిపారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా సల్మాన్ తన పుట్టినరోజు వేడుకలను గురువారం అర్ధరాత్రి ముంబయిలోని తన సోదరి నివాసంలో అట్టహాసంగా జరుపుకొన్నారు. ఈ వేడుకలో కుటుంబసభ్యులతోపాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఆయన తన మేనల్లుడు అహిల్‌తో కలిసి కేక్ కట్ చేశారు.