క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే పనిలో ఉన్నాడు. అందుకే తన తదుపరి చిత్రాలను బహు భాషా చిత్రాలుగా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న డియర్ కామ్రేడ్‌ను నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఆ తరువాత కూడా ఓ ట్రై లింగ్యువల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు విజయ్.
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బైక్ రేసర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే నటించనున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న విజయ్, షాలినిల జోడి మరోసారి తెర మీదకు వస్తుండటం ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్ అయ్యింది.