నటుడు విక్రమ్ కుమారుడు ధ్రువ్ ‘హీరోగా పరిచయమవుతున్న ‘వర్మ’ చిత్రం విడుదలకు ముందు ఆగిపోయింది. ఈ విషయం ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తన కుమారుడిని తెరకు పరిచయం చేయాలని విక్రమ్ ఎదురుచూసిన ‘వర్మ’ చిత్రం రద్దు కావడం ఆయన అభిమానులకు కూడా తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది. విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం రీమేకే ‘వర్మ’. ఈ 4 ఎంటర్‌టైన్‌మెంట బ్యానరుపై బాల దర్శకత్వంలో ఈ సినిమా ప్రేమికుల రోజున విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్మాణ వర్గానికి అసంతృప్తి కలగడంతో సినిమాను రద్దు చేశారు. వర్మలోని ద్వితీయార్థం తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ కి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని, అందువల్లే సినిమాను విడుదల చేయడం లేదని ఈ4 ఎంటర్‌టైన్‌మెంటు గురువారం సాయంత్రం ప్రకటించింది. సినిమా అసంతృప్తిని కలిగిస్తున్నందువల్లే తెరపైకి తీసుకురావడం లేదన్నారు. అయితే దర్శకుడు బాల పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడంతో గమనార్హం. తెలుగు మాతృకలోని ఒరిజినల్ భావన ఉట్టిపడేలా ధ్రువ్ హీరోగా మళ్లీ కొత్తగా చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు పేర్కొంది.