‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. ఆ తర్వాత ఆయన ‘భరత్ అనే నేను’, ‘సమ్మోహనం’, ‘గీత గోవిందం’ తదితర చిత్రాల్లో సందడి చేశారు. కాగా ఇప్పుడు ఓ హాలీవుడ్ సినిమాలో రాహుల్ హీరోగా నటించబోతున్నారు. ప్రదీప్ కటసాని ఈ సినిమా దర్శకత్వ, నిర్మాణ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సిల్క్ రోడ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ‘ఈ వార్త నేను ఊహించిన దానికంటే వేగంగా బయటికి వచ్చింది. నేను ఇన్నాళ్లూ ఎదురుచూసిన నా డ్రీమ్ ప్రాజెక్టు ఇది. హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నా. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నా’ అని ఆయన పోస్టర్‌ను షేర్ చేశారు.
అమెరికాలో జీవించే తెలుగు విద్యార్థి జీవితం నేపథ్యంలో ఈ సినిమాను తీయబోతున్నట్లు సమాచారం. లాస్ ఏంజెల్స్‌లో సైబర్ క్రైమ్, డ్రగ్స్ చుట్టూ ఈ కథ సాగనున్నట్లు తెలిసింది. ఇందులో రాహుల్ సీరియస్ పాత్రలో కనిపించబోతున్నారట. 2 గంటల నిడివితో ఈ చిత్రాన్ని రూపొందించాలని యూనిట్ భావిస్తోన్నట్లు చెబుతున్నారు.