1980 కాలంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఒక కబడ్డీ ఆటగాడి బయోపిక్ ‘అర్జున్ చక్రవర్తి’. ఈ సినిమాకి వేణు కె.సి. రచన చేస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. నూతన నటీనటులు సిజా రోజ్, విజయరామరాజు జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్, దయానంద్ రెడ్డి, అజయ్ ఘోష్, దుర్గేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. గన్నెట్ సెల్యులాయిడ్ పతాకంపై శ్రీని గుబ్బాలా నిర్మిస్తున్నారు. ప్రపంచ కబడ్డీ దినోత్సవం సందర్భంగా ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను పోస్టర్ మరియు వీడియో రూపంలో విడుదలచేశారు.
ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ, “రెండు సంవత్సరాల క్రితం ‘అర్జున్ చక్రవర్తి’ షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జమ్ము-కశ్మీర్ సహా దేశవ్యాప్తంగా 125 పైగా ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపి, 75 శాతం సినిమాని పూర్తి చేశాం” అని చెప్పారు. ఇందులో హీరో పాత్ర ప్రయాణం చిన్నతనం నుంచి మధ్య వయసు దాకా సాగుతుంది. ఆ వయసు తారతమ్యాలు కనిపించడం కోసం హీరో ఏడు రకాల శారీరక మార్పుల్ని ప్రదర్శించడం విశేషం. ‘అర్జున్ చక్రవర్తి’ అనేది పీరియాడికల్ డ్రామా కావడంతో.. 1960,1980ల కాలం నాటి విలేజ్ సెట్లను, 1960ల నాటి హైదరాబాద్ టౌన్ సెట్‌ను కళాదర్శకుడు సుమిత్ పటేల్ ఆధ్వర్యంలోని ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఎంతో శ్రమకోర్చి ప్రామాణికంగా నిర్మించింది. ఈ సినిమాపై నిర్మాతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇందులోని గ్రామీణ వాతావరణం దృశ్యపరంగా బాగా ఆకట్టుకుంటుందన్నారు. పాన్ ఇండియా విడుదల కోసం సిద్ధం చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అనువదించి, పాన్ ఇండియా విడుదల కోసం సిద్ధం చేస్తున్నామని నిర్మాత శ్రీని గుబ్బాల తెలిపారు.