రానా దగ్గుబాటి నటించిన తాజా చిత్రం ‘అరణ్య’. ఈ సినిమా కోసం రానా అడవి మనిషిగా మారిపోయారు. లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇదే. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఆసక్తిని రేకెత్తించింది.
కథ: విశాఖ సమీపంలోని చిలకలకోన అడవి అది. అక్కడ తరతరాలుగా ఏనుగుల్ని రక్షించే ఓ కుటుంబంలో పుట్టి పెరుగుతాడు నరేంద్ర భూపతి (రానా). అడవి, ఏనుగుల రక్షణ కోసం పాటు పడుతున్నందుకు ఫారెస్ట్ మేన్‌గా రాష్ట్రపతి పురస్కారం కూడా అందుతుంది. కేంద్రమంత్రి కనకమేడల రాజగోపాలం (అనంత్ మహదేవన్) చిలకలకోన అడవిపై కన్నేస్తాడు. అక్కడ డీ.ఎల్.ఆర్ టౌన్‌షిప్ కట్టేందుకు రంగంలోకి దిగుతాడు. ఏనుగులు నీటి కోసం వెళ్లే అటవీ ప్రాంతంలో గోడ కూడా కట్టేస్తాడు. మరి అడవినే నమ్ముకున్న ఏనుగులు, అరణ్య… కేంద్రమంత్రిపై ఎలా పోరాటం చేశారు? అడవిని ఎలా దక్కించుకున్నారనే విషయాల్ని తెరపై చూడాల్సిందే.
నటీనటులు: రానా తన పాత్రలో జీవించాడు. రానా తప్ప మరొకరు చేయలేరనిపించేలా ఆయన ఆ పాత్రపై ప్రభావం చూపించారు. విష్ణు విశాల్ కూడా శింగన్న అనే హుషారైన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. జోయాతో ఆయన లవ్ ట్రాక్ ఆకట్టుకునేలా ఉంటుంది. శ్రియ పిల్గవోంకర్ జర్నలిస్టుగా కీలకమైన పాత్ర చేసింది. కేంద్రమంత్రిగా అనంత్ మహదేవన్, శింగన్నతో కలిసి ప్రయాణం చేసే పాత్రలో రఘుబాబు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. వనమాలి మాటలు.. పాటలు బాగున్నాయి.
విశ్లేషణ: అడవులు… ఏనుగుల సంరక్షణ ఆవశ్యకతని చాటి చెప్పే కథ. నిజానికి ఇలాంటి కథలు ఇదివరకటి సినిమాల్లోనూ చూశాం. వాటితో పోలిస్తే… అరణ్య కొంచెం ప్రత్యేకంగా నిలబెడుతుంది. ముఖ్యంగా అరణ్యకీ, ఏనుగులకీ మధ్య అనుబంధాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు… ఆ కోణంలో భావోద్వేగాల్ని రాబట్టిన విధానం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తొలి సన్నివేశం నుంచే అరణ్య ప్రపంచంలో ప్రేక్షకుడిని భాగం చేశాడు దర్శకుడు ప్రభు సాల్మన్. ఆహ్లాదాన్ని పంచే పచ్చటి అందాల్ని చూపెడుతూ కథని ప్రారంభించాడు. అభివృద్ధి, ఉపాధి పేరుతో అడవుల్ని నాశనం చేస్తున్న విధానాన్ని కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. టౌన్‌షిప్ కాంట్రాక్టర్‌కీ, అరణ్యకీ మధ్య పోరాటం నేపథ్యంలోనే ఫస్ట్‌టాప్ సాగుతుంది. కుమ్కీ ఏనుగు శింగన్న (విష్ణు విశాల్), నక్సలైట్ మల్లి (జోయా) పాత్రల నేపథ్యంలో ఉపకథని కూడా జోడించారు. ఆ నేపథ్యంలో సన్నివేశాలు కథని మరింత ఆసక్తికరంగా మార్చాయి.
అయితే ద్వితీయార్ధంలో ఆ పాత్రలు అర్ధంతరంగా కనుమరుగవుతాయి. పతాక సన్నివేశాలు ఈ సినిమాకి ప్రధాన బలం. చివరి 30 నిమిషాలు పండిన భావోద్వేగాలు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయి. అటవీ నేపథ్యంలో ఈ కథ ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచుతుంది. ఈ సినిమాలో పర్యావరణం గురించి విలువైన విషయాలెన్నో ఉన్నాయి.
టైటిల్: అరణ్య
నటీనటులు: రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్ తదితరులు
దర్శకత్వం: ప్రభు సాల్మన్
నిర్మాత : ఈరోస్ ఇంటర్‌నేషనల్ సంస్థ
సంగీతం: శాంతను మొయిత్రా
హైలైట్స్: రానా నటన
డ్రాబ్యాక్స్: ఊహకందేలా సాగే కథనం
చివరిగా: అడవులు-ఏనుగుల సంరక్షణ ఆవశ్యకతని చాటి చెప్పే కథ ‘అరణ్య’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)