ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ తన కథను దొంగిలించారని రచయిత వరుణ్ రాజేంద్రన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘సెంగోల్’ అనే టైటిల్‌తో తను రిజిస్టర్ చేయించుకున్న కథతో మురుగదాస్ ‘సర్కార్’ సినిమా తీశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్శక, నిర్మాతలు తనకు రూ.30 లక్షల పారితోషికం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఈ వివాదం కొనసాగుతోంది. దీని గురించి ఇటీవల మురుగదాస్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటామని అన్నారు.
తాజా సమాచారం ప్రకారం న్యాయస్థానం ఎదుట హాజరు కాకముందే సోమవారం వరుణ్‌తో ‘సర్కార్’ దర్శక, నిర్మాతలు రాజీపడినట్లు తెలిసింది. సినిమా కథ క్రెడిట్‌ను వరుణ్‌కు ఇస్తూ టైటిల్స్‌లో ఆయన పేరు వేయించడానికి యూనిట్ ఒప్పుకొందట. రూ.30 లక్షలు పారితోషికంగా ఇచ్చినట్లు కూడా సమాచారం.
నిజానికి మంగళవారం మద్రాసు హైకోర్టు ఇరుపక్షాల వాదోపవాదాలు వినాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మురుగదాస్, దక్షిణ చిత్ర పరిశ్రమ రచయితల సంఘం అధ్యక్షుడు కె. భాగ్యరాజ్ కోర్టుకు హాజరయ్యారు. కానీ వరుణ్ రాలేదు, దీంతో కొన్ని గంటలపాటు కేసును వాయిదా వేశారు. చివరికి ఇరు పక్షాలు రాజీపడ్డామని నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్ పేర్కొందట. దీంతో ఇక ‘సర్కార్’ విడుదలకు ఎటువంటి అడ్డంకులు లేవని అంటున్నారు. తమిళ హీరో విజయ్ నటించిన చిత్రమిది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో విజయ్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా కనిపించనున్నారు.