ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేయాలని, ఇకపై ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ 5 రకాల ప్రతిపాదనలు సమర్పించింది. వాటికి ప్రభుత్వం యథాతథంగా ఆమోదం తెలిపింది. త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయనుంది.
ఏపీఎస్ ఆర్టీసీలోని 52 వేల మంది ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెరగనుంది. 15 రోజుల్లో విధి విధానాలు సిద్ధం కానున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలోని కాంట్రాక్టు కార్మికులు యథాతథంగా కొనసాగుతారు. ఆర్టీసీకి ఉన్న రూ. 330 కోట్ల ఆర్థిక బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది.