చంద్రుడిపై పరిశోధనల కోసం నేడు శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతంగా లాంచ్ కావడంతో ప్రముఖులంతా మన శాస్త్రవేత్తలను ప్రశంసలతో ముంచెత్తారు. ఈరోజు ప్రతి భారతీయుడు అత్యంత గర్వపడే రోజని ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. వరుస ట్వీట్లతో మోదీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు ఈ ప్రయోగ విజయంపై తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
మన దేశ చరిత్రలో అద్భుతమైన క్షణాలు ఇవి అని చంద్రయాన్ 2 ప్రయోగం మన శాస్త్రవేత్తల నైపుణ్యాన్ని, శాస్త్ర రంగంలో కొంత పుంతలు తొక్కాలన్న 130 కోట్ల మంది దేశ ప్రజల నిబద్ధతను చూపిస్తోంది. ప్రతి భారతీయుడు ఈ రోజు చాలా గర్వంగా ఉన్నాడు. మనసులో, స్ఫూర్తిలో భారతీయత తొణికసలాడింది. చంద్రయాన్ 2 పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం ఈ రోజు ప్రతి భారతీయుడి ఆనందానికి అత్యంత ముఖ్యకారణం. ఈ ప్రయోగానికి సంబంధించిన పరిశోధనలు యువతను శాస్త్రరంగం, పరిశోధన, ఆవిష్కరణల వైపు దృష్టి సారించేలా చేస్తాయి అని మోదీ ట్వీట్ చేశారు.
చంద్రయాన్ 2 ప్రయోగం చరిత్రాత్మకం. దేశప్రజలకు అత్యంత గర్వకారణం. ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు నా అభినందనలు: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
చంద్రయాన్ 2 ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు శాస్త్రవేత్తలు, దేశ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన దేశాన్ని గర్వపడేలా చేసినందుకు శాస్త్రవేత్తలకు ప్రత్యేక అభినందనలు: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
స్వదేశీ పరిజ్ఞానంతో ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో కొత్త చరిత్ర సృష్టించింది. ఇస్రో, శాస్త్రవేత్తల పట్ల దేశం గర్వంగా ఉంది: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
చంద్రయాన్ -2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. కఠోర శ్రమ, అద్భుతమైన ప్రతిభాపాటవాలతో ఈ ప్రయోగం విజయవంతం చేశారు: తెలంగాణ సీఎం కేసీఆర్,
ఇస్రోకు కంగ్రాట్స్. కోట్లాది ఆశలతో జాబిల్లిపైకి ఉపగ్రహాన్ని పంపిన ఈ సందర్భం చరిత్రాత్మక ఘట్టం. ఇస్రో శాస్త్రవేత్తలు, షార్‌కు అభినందనలు: ఏపీ సీఎం వైఎస్ జగన్
అంతరిక్ష పరిశోధనల్లో భారత ప్రతిష్ఠను మన శాస్త్రవేత్తలు పెంచారు. అంతరిక్ష ప్రయోగంలో భారత్ మరో మైలురాయిని దాటింది. ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-2 ప్రయోగంలో కీలక బాధ్యతలను మహిళలు నిర్వహించడం మహిళా సాధికారతకు ముందడుగు: చంద్రబాబు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం భారత్‌ను అగ్ర దేశాల సరసన నిలిపింది. చంద్రయాన్- 2 రాకెట్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడం శుభపరిణామం. విజయవంతంగా ఉపగ్రహాన్ని పంపిన ఇస్రో శాస్త్రవేత్తలకు నా తరఫున, జనసైనికుల తరఫున అభినందనలు. పరిమిత బడ్జెట్‌తోనే చంద్రుడి పైకి రోవర్‌ను ప్రయోగించడంతో అన్ని దేశాలూ మన సాంకేతిక పరిజ్ఞానం వైపు ఆసక్తిగా చూడటం గొప్ప విషయం. చంద్రునిపై ఉన్న వాతావరణ పరిస్థితులు, చంద్రుని పుట్టుక, నీరు, అక్కడి ఉపరితలం, ఇతర మూలకాల గురించి లోతుగా తెలుసుకునేందుకు చేపట్టిన చంద్రయాన్ – 2తో అంతరిక్ష పరిశోధనల్లో మన దేశం మరో మెట్టు ఎక్కింది. భారత శాస్త్రవేత్తలు అంతరిక్ష యానంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా: జనసేన అధినేత పవన్ కల్యాణ్