అప్పట్లో ఒకడుండేవాడు అని చాలా మంది తమ మాటల్లో అంటూ ఉండటం మనం చాలా సార్లు వినే ఉంటాం. జనాల నోళ్లలో బాగా నానిన అదే మాటతో సినిమా చేస్తున్నారు నారా రోహిత్, శ్రీ విష్ణు. వారిద్దరు కలిసి నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమైంది. తన్య హోప్, సాష కీలక పాత్రల్లో నటించిన చిత్రమిది. ఆరన్ మీడియా వర్క్స్ నిర్మిస్తోంది. రోహిత్ సమర్పిస్తున్నారు. ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ ఈ మధ్య ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇందులో నటించిన నటీనటుల చిన్నప్పటి ఫోటోలను చూపించి వాళ్లెవరో కనిపెట్టిన వారికి అద్భుతమైన బహుమతులను ఇస్తామని ఇటీవల సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో నిర్మాతలు ప్రకటించారు. ప్రైజ్ ల్లో ఐప్యాడ్‌లు కూడా ఉండటం ఆసక్తికరం.దాంతో ఈ కాంటెస్ట్ కు విపరీతమైన స్పందన వచ్చింది. స్పందనకు దర్శకనిర్మాతలు చాలా ఆనందంగా ఫీలవుతున్నారు. అదే ఆనందంతో ఈ కాంటెస్ట్ కోసం మరి కొన్ని రోజుల్లో ఇంకా ఆసక్తికరమైన ఫోటోలను కూడా పోస్ట్ చేయనున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు అక్టోబర్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. యాక్షన్ డ్రామాగా సాగే ఈ చిత్రంలో నారా రోహిత్ స్పెషల్ పార్టీ పోలీస్ ఆఫీసర్ నూరుద్దీన్ మొహమ్మద్ అలీగా నటించారు. క్రికెటర్ కావాలనుకునే యువకుడిగా శ్రీవిష్ణు నటించారు. త్వరలోనే ఆడియో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. టీజర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నారు.