AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో మరి కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడనుంది. సోమవారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల ప్రచార హోరు ఆకాశాన్నంటుతుంది. సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఏపీలో ఓటింగ్ శాతం పెంచేందుకు సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బిజెపీ కూటమి వినూత్నంగా ప్రచారం చేపట్టింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారిని మే 13న ఓటింగ్ కు రప్పించేందుకు ప్రచారం చేస్తోంది. ‘శుక్రవారం బయలుదేరి రండి….సోమవారం ఓటేయండి’ అంటూ పిలుపునిస్తూ క్యాంపెయినింగ్ చేస్తూ.. సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తోంది.
ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని స్వాగతిస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రచారానికి ఎన్డీయే కూటమి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ‘హైదరాబాద్ నుంచి మన ఆంధ్రాకు వెళదాం….. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం!’ అంటూ పలు స్లోగన్స్ తో పోస్టర్లను విడుదల చేసింది. ఏపీలో ఓటింగ్ శాతం ఎంత పెరిగితే… కూటమికి అంత లాభం అని కూటమిలోని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. భారీగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ తో ఇప్పటికే ట్రెండ్ సెట్టైయ్యిందంటుని కూటమి భావిస్తోంది.
ఏపీలో మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు పోలింగ్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇప్పటికే ప్రయాణాలు మొదలయ్యాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారిని సొంత రాష్ట్రాలకు రప్పించేందుకు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో వున్న ఏపీ ప్రజలను సొంతప్రాంతాలకు వచ్చి ఓటు వేసి తమను గెలిపించాలంటూ ఏపీలో పోటీ చేస్తున్న అభ్యర్థులు విజ్ఞప్తులు చేస్తున్నారు.
కొందరైతే తాయిలాలు కూడా ఇచ్చి మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్న పలు కమ్యూనిటీలకు చెందిన వారిని ఆయా నేతలు ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. కులాల ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కొందరైతే ప్రయాణ ఛార్జీలు కూడా తామే చెల్లిస్తామంటూ హామీలిచ్చినట్టు తెలుస్తోంది.
ఏపీలోని పలు జిల్లాల్లోని ఓటర్లు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌లో ఉంటున్నారు. సొంత ఊర్లో ఓటు వేసేందుకు తెలంగాణనుంచి ఏపీకి బయల్దేరిన జనాలతో రోడ్లు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. కొందరు కార్లలోపయనమైతే, మరికొందరు బస్సుల్లో, ట్రైన్లలో సొంతూర్లకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో రద్దీ పెరిగి ప్రైవేట్ బస్సుల్లో ధరలు కూడా భారీగా పెంచేశారు. టికెట్లు దొరక్క పలువురు అవస్థలుపడుతున్నారు. తెలంగాణ ఆర్టీసీ కూడా టికెట్ల ధరలు పెంచడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం టికెట్లు రెట్టింపు ధరకు కొనాల్సిన పరిస్థితి నెలకొందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. ఆ టికెట్ కూడా నాలుగు, ఐదు రోజుల ముందు బుక్ చేసుకుంటే గాని దొరకని పరిస్థితి ఉందని, ఇప్పుడు హడావుడిగా వెళ్దామని బస్టాండ్‌కు వస్తే ఒక్కరికి విజయవాడకు రూ.2000 పైన డబ్బులు అడుగుతున్నారని పలువురు ఆంధ్రా ఓటర్లు వాపోతున్నారు.
బస్టాండ్‌లోని కొందరు ప్రయాణికులను కదిలించగా మేము ఓటు వేసేందుకు విజయవాడ వెళ్లాలి. ఉదయం నుంచి బస్సులు కోసం వేచిచూస్తున్నాం. ఒక్క బస్సు సమయానికి రావటం లేదు. కారులో వెళ్దామంటే ఛార్జీలు మరింత ఎక్కువ అడుగుతున్నారు. సరైన ప్రయాణ సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు.
ఒకవేళ బస్సులు వస్తున్నా ఖాళీ లేవు. ఊరు ఎలా వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఉన్న ఏపీ ఓటర్లు తమ సొంత ఊర్లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే రైళ్లు, బస్సులు బుక్ చేసుకున్నప్పటికీ, తగినన్ని లేవని ఆరోపిస్తున్నారు. ఇదే అదనుగా పలువురు ప్రైవేట్ వాహనదారులు అందిన కాడికి దండుకుంటున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. రైళ్లు, బస్సులు, ప్రత్యేక సర్వీసులను నడపాలని ఆంధ్ర ప్రయాణికులు కోరుతున్నారు.