AP Politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రోజుకో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కడపలో ఎగ్జిట్ పోల్ సర్వే చేసిన ఓ ప్రముఖ మీడియా సంస్థ ప్రతినిధికి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి.
కడప కంచుకోటలో వైసీపి ఓటర్లు ఈసారి క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. పులివెందులలో కొంతమంది టిడిపి అభ్యర్ధి బీటెక్ రవికి ఓట్లు వేశారట. బద్వేల్, రాయచోటి, రాజంపేట, తదితర కొన్ని నియోజకవర్గాలలో ముస్లింలు టిడిపికి ఓటు వేశారని.. అలాగే కడపలో వైసీపి ఓటర్లు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వైఎస్ షర్మిలకు ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. కడప పట్టణంలోని ముస్లింలలో కొందరు టిడిపికి ఓట్లు వేయగా కొందరు ఓట్లే వేయలేదు.
వైఎస్ విజయమ్మ అమెరికాలో ఉన్నా కడప ప్రజలను ఉద్దేశిస్తూ ఎన్నికలకు ముందు ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిలను ఆదరించాలని, తనకు ఓటువేసి గెలిపించాలని విజయమ్మ విజ్ఞప్తిని కడప ప్రజలు గౌరవించినట్టు తెలుస్తోంది. కడప ప్రజలు కొందరు వైఎస్ షర్మిలకు ఓట్లు వేశారని.. ఇద్దరూ వైఎస్సార్ బిడ్డలే కదా అని ఇద్దరినీ గెలిపించుకుందామనే ఆలోచనతో ఎంపీ ఓటు వైఎస్ షర్మిలకు, ఎమ్మెల్యే ఓట్లు జగన్‌కు వేసినట్లు సమాచారం.
కడప నుంచి ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేసిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసు గురించి షర్మిల, సునీత చేసిన ఆరోపణలకు జగన్, అవినాష్ రెడ్డి సమాధానం చెప్పుకోలేకపోవడం, కూతురినే గెలిపించాలని విజయమ్మ పిలుపు నివ్వడం.. ఇంతే కాకుండా ఈసారి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలిచి అధికారంలోకి రాబోతోందనే మౌత్ టాక్ వంటి పలు అంశాలు కడప జిల్లా ప్రజల వైఖరిలో మార్పు రావడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
కనుక కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో నారా లోకేష్‌ని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించాలని కసితో రగిలిపోయిన వైఎస్ జగన్‌కు కడపలో వైసీపి ఓడిపోతే అది గట్టి ఎదురుదెబ్బ అవుతుంది.