AP Politics: ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రచారాల హోరు జోరుగా సాగుతోంది. ఈసారి ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జగన్‌ను ఓడించడానికి రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒక్కటయ్యాయి. అంతేకాక వివేకానంద రెడ్డి హత్య గురించి పదే పదే ప్రస్తావిస్తూ.. వైసీపీకి చెమటలు పట్టిస్తున్నారు. పైగా సర్వేలు కూడా జగన్ గ్రాఫ్ తగ్గింది అని చెబుతున్నాయి.
ఈ నేపధ్యంలో అందరి దృష్టి ఏపీ రాజకీయాలపైనే పడింది. ప్రత్యేకంగా కడప రాజకీయాలు ఈసారి మరింత ఆసక్తికరంగా మారాయి. పులివెందుల అసెంబ్లీ స్థానానికి సీఎం జగన్ పోటీలో ఉండగా, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల బరిలో నిలిచారు. వీరిద్దరిలో విజయమ్మ మద్దతు ఎవరికి ఉంటుందనేది చర్చనీయాంశమైంది. విజయమ్మ ఎవరి వైపున ప్రచారం చేస్తారు? లేదా సైలెంట్‌గా ఉంటారా అనేది సస్పెన్స్.
గత ఎన్నికల్లో కలిసి పనిచేసిన అన్నాచెల్లెళ్లు ఈసారి వేర్వేరు పార్టీల తరఫున బరిలో నిలవడం గమనార్హం.2009కి ముందు వరకు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2009లో వైఎస్ జగన్ మొదటిసారి కడప ఎంపీగా గెలిచింది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే.
ఆ తరువాత కడప లోక్‌సభ వైసీపీకి కంచుకోటగా మారింది. ఆమాటకొస్తే కడప జిల్లాలో ఇప్పటికీ వైఎస్ కుటుంబానికే పట్టు ఉంది. అయితే ఈసారి కడప ప్రజలు వైఎస్ కుటుంబంలోని ఎవరికి మద్దతు ఇస్తారనేది రసవత్తరంగా మారనుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల ఈ నెల 5 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. వైఎస్ఆర్ జిల్లా కాశినాయన మండలం ఆమగంపల్లి నుంచి ఆమె బస్సు యాత్ర ప్రారంభిస్తారు.
కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేస్తుండటంతో అక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. వైఎస్ షర్మిలకు వివేకానందరెడ్డి కూతురు సునీత, భార్య సౌభాగ్యమ్మ తోడుగా నిలిచారు. దీంతో పాటు మరో ఆసక్తికర అంశం కూడా తెర మీదకు వచ్చింది. పులివెందుల నుండి వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మను పోటీకి దింపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆమెను ఎమ్మెల్యే అభ్యర్ధిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన రావచ్చు.
ప్రస్తుతం జగన్‌పై ఏపీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. జగన్‌పై పోటీగా వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ బరిలోకి దిగినట్లయితే ప్రజలు ఎవరికి మద్దతిస్తారనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. 2019కి ఇప్పటికీ కడప రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. వైఎస్ జగన్‌వైపు ఏకపక్షంగా ఉండే ప్రజలు ఇప్పుటి పరిస్థితులను బట్టి మార్పు చూపించే అవకాశం ఉంది. ఒకవేళ జగన్ విజయం సాధించినా గతంలో వచ్చిన మెజారిటీ సాధించకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.