కరోనా భయంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైతే పోలీసులు మాత్రం మండుటెండల్లో సైతం పనిచేస్తున్నారు. రోడ్లపైకి ప్రజలు ఎవరూ రాకుండా కరోనా పట్ల వారికి అవగాహన కల్పిస్తూ తమ విధులు నిర్వహిస్తున్నారు. అవసరం ఉంటే తప్ప రోడ్ల మీదకు రావొద్దంటూ చేతులు జోడించి వేడుకుంటున్నారు. అనవసరంగా కొందరు కుంటిసాకులు చెబుతూ రోడ్లపైకి వచ్చేవారికి లాఠీలతో సమాధానం చెప్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో పోలీసుల పాత్ర ఎక్కువ. వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. కొందరు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ప్రజల కోసం శ్రమిస్తున్నారు. తాజాగా విజయనగరానికి చెందిన ఎస్‌ఐ తన తల్లి చనిపోయినా అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు.కన్న తల్లి చనిపోయిందని తెలిసినా ఆ బాధను గుండెల్లోనే దిగమింగి, కరోనా విధుల్లో పాల్గొన్నారు.
విజయనగరానికి చెందిన శాంతారామ్ విజయవాడలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. 3 రోజుల క్రితం తన తల్లి అనారోగ్యంతో మృతిచెందారు. అంత్యక్రియలకు వెళ్లాలంటే 4 జిల్లాలు, 40 చెక్‌పోస్టులు దాటి వెళ్లాలి. అంతేకాకుండా ఎంతోమందిని కలవాల్సి ఉంటుంది. దానివల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ఆ రూల్స్ పోలీసులకూ పాటిస్తాయి కదా. ఆయనకు సెలవు ఇచ్చినప్పటికీ వెళ్లక పోవడం గమనార్హం. ఒకవేళ వెళ్లినా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందని, విధులకు ఆటంకం కలుగుతుందని వెళ్లలేదు. వీడియో కాల్ ద్వారా కన్న తల్లిని చివరి చూపు చూసుకున్నారు. అతని తమ్ముడి ద్వారా అంత్యక్రియలను పూర్తి చేయించారు. నేను విధులకు దూరంగా ఉంటే తన తల్లి ఆత్మ శాంతించదని, ఈ సమయంలో తాను విధుల్లో ఉంటేనే తన తల్లి ఆత్మకు శాంతి చేకూరుతుందని భావిస్తూ అంత్యక్రియలకు వెళ్లలేదని ఎస్సై వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆ ఎస్సైపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు అంటూ సెల్యూట్ చేస్తున్నారు.