AP Land Titling Act: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అమల్లోకి తెచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తాము తీసుకురాలేదని చెప్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిందే మేము అమలుచేస్తున్నామని చెప్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు సంబంధించిన బిల్లును మంత్రి ధర్మాన కృష్ణదాస్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆసమయంలో జగన్ కళ్లలో ఆనందం చూస్తున్నానని గొప్పగా ప్రకటించారు. అయితే ఈ యాక్ట్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో వైసీపీ నేతలు రివర్స్ గేర్ వేస్తున్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు సంబంధించి జీవో రావడంతో ఎవరైనా భూముల రిజిస్ట్రేషన్‌కు వెళ్తే వారిని మీ ఆస్తి పత్రాలన్నీ మా దగ్గర పెట్టండి. మీకు జిరాక్స్ పత్రం ఇస్తాము అనడంతో ప్రజల ఖంగు తింటున్నారు. దీంతో మా ఆస్తులపై ప్రభుత్వం పెత్తనమేంటని ఎదురుతిరుగుతున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ నేతలు, పలువురు లాయర్లు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు ప్రజలకు అవగాహన రావడంతో తిరగబడుతున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ కొత్త చట్టానికి సంబంధించిన జీవో పత్రాలు బయటకు వచ్చాయి. దీంతో ప్రజల్లో ఒక్కసారిగా భయం ఏర్పడి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులన్నిటిపైనా హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయా అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పట్టాదారు పాస్‌పుస్తకంగా జగన్ ఫొటో ముద్రించారు. ఏపీలోని ప్రజలకు వారి తండ్రులు, తాతలు ద్వారానో, లేక తాను స్వయంగా సంపాదించుకున్న ఆస్తులపై ప్రభుత్వం పెత్తనమేంటని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మా ఆస్తులపైన జగన్ ఫొటో ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను కొందరు వైసీపీ నేతలు సైతం వ్యతిరేకిస్తున్నారట. ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్‌కు వెళ్తే ఆస్తి పత్రాలన్నీ ప్రభుత్వంవద్దే పెట్టుకుంటున్నారని వైసీపీ నేతలు సైతం భయపడుతున్నారట. ప్రస్తుతం వైసీపీ నేతలు కూడా తమ ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేసుకోకుండా వేచి చూసే ధోరణిలో ఉన్నారట. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం మారినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. వైసీపీ నేతలు సైతం తమ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం మారినప్పుడు చూసుకుందామనే యోచనలో ఉన్నారట. ఈసారి ఎన్నికల్లో జగన్ గనుక గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజల ఆస్తులన్నీ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.