ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఆంధ్ర-కర్నాటక సరిహద్దులో హల్‌చల్ చేశారు. ఏపీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బెంగళూరు నుంచి తన అనుచరులు 36 మంది బంధువులతో 5 వాహనాల్లో ఏపీ సరిహద్దుకు చేరుకున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని చెక్‌పోస్టు వద్దకు రాగానే పోలీసులు ఎమ్మెల్యేను, వారి బంధువులను అడ్డుకున్నారు. లాక్‌డౌన్ ఉన్నందున సరిహద్దులు దాటి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులపై ఎమ్మెల్యే మధుసూదన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేను.. నన్నే ఆపుతారా అంటూ పోలీసులపై మండిపడ్డారు. పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఆయన వినలేదు. ఉన్నతాధికారులు తమకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని, సరిహద్దులు దాటి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని మదనపల్లి డీఎస్పీకి తెలియచేయడంతో ఆయన వచ్చి నచ్చచెప్పడంతో ఎమ్మెల్యే ఆయన అనుచరులను వెనక్కి కర్నాటకకు పంపారు.
ఏపీలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరిగిపోతుండటం ఆందోళనను కలిగిస్తోంది. ఏపీలో ఇవాళ కొత్తగా మరో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 500 దాటిపోయింది. ఇలాంటి సమయంలో బాధ్యత గల వ్యక్తులే ఇలా వ్యవహరిస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది.