సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు ఫైనల్ స్టేజ్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బ్రేక్ వేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ జారీచేసింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు సినిమా విడుదలను ఆపాలని ఆదేశించింది. అ్పపటి వరకు సినిమా హాళ్లలో ప్రదర్శన కానీ, సోషల్ మీడియా లోని యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర మీడియాల్లో కూడా సినిమా ప్రదర్శించొద్దని స్పష్టం చేసింది. ఇక రాంగోపాల్ వర్మ, రాకేష్ రెడ్డి , అగస్త్య మంజు తదితరులకు నోటీసులు పంపాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల కానున్న తరుణంలో హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ చర్చనీయాంశంగా మారింది.
ఒకవేళ సినిమా విడుదలైనా కూడా థియేటర్స్ దగ్గర అల్లర్లు కూడా జరుగతాయనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ నాయకులు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు సినిమా విడుదల ఆపేయాలంటూ నిర్మాత రాకేష్ రెడ్డితో పాటు వర్మకు కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది.