పెద్ద సినిమాలకు ఏపీ ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. సినిమా టిక్కెట్ రేట్లు, ఆటల ప్రదర్శనపై ఓ క్లారిటీకి వచ్చింది. దానికి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ చట్టం సవరణల బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఇక మీదట రోజుకు నాలుగు ఆటలు మాత్రమే థియేటర్లలో ప్రదర్శించాలని. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టిక్కెట్ రేట్ ఉంటుందని నాని చెప్పారు. పెద్ద సినిమాల విడుదల సమయంలో అత్యధిక షోస్ ప్రదర్శిస్తున్నారని, అలానే టిక్కెట్ రేట్లను తమ ఇష్టానుసారంగా పెంచేసి అమ్ముతున్నారని, దానికి జీఎస్టీ ని కూడా వారు చెల్లించడం లేదని నాని అసెంబ్లీలో ఆరోపించారు. వీటన్నింటికీ చెక్ పెట్టడం కోసమే ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థను తీసుకురాబోతోందని చెప్పారు. ఈ విధానాన్ని ఏ నిర్మాత విమర్శించడంలేదని, కేవలం కొన్ని రాజకీయ పార్టీలే దీనిపై బురద చల్లుతున్నాయని అన్నారు. బీద వారికి ఏకైక వినోదసాధనంగా ఉన్న సినిమాను సరసమైన ధరకు అందించడమే ప్రభుత్వం కర్తవ్యమని, గతంలో థియేటర్ కౌంటర్ల దగ్గర కొద్ది టిక్కెట్లు అమ్మి, హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టి, ఆ పైన బ్లాక్ లో టిక్కెట్లు అమ్మేవారని, అలాంటి వాటికి ఈ ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంతో చెక్ పెడతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలకు షాక్ తగిలినట్టే. అయితే ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు విక్రయిస్తూ కూడా ఆటలపై ఆంక్షలు పెట్టడం, టిక్కెట్ రేట్లను నియంత్రించాలని అనుకోవడం సమజసం కాదని కొందరు అంటున్నారు. సినిమా టిక్కెటింగ్ వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత కూడా ఇలా ఆటలపై, టిక్కెట్ రేట్లపై ఆకాంక్షలు విధిస్తే పెద్ద సినిమా నిర్మాతలకు తీరని నష్టం వాటిల్లుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.