శనివారం సాయంత్రం చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత.. వెలువడే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ కోసం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ విడుదలైతే కొంతవరకు ఫలితాలపై అంచనా రానుంది. మరి అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి.. ఇందులో చెప్పేదే జరుగుతుందా అనే వివరాలు ఒకసారి చూద్దాం..
ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి?
సాధారణంగా ఎలక్షన్స్ జరిగిన తర్వాత.. ఫలితాల విడుదలకు ముందు.. కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేస్తూ ఉంటాయి. అయితే పూర్తి పోలింగ్ సమయం ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసేందుకు.. సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 126 ఏ ప్రకారమే ఈ నిబంధన ఉంటుంది. అంత లోపల ఏ వ్యక్తి గానీ, సంస్థలు కానీ.. ఎగ్జిట్ పోల్స్‌ను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సహా ఎలాంటి మాధ్యమాల ద్వారా బయట పెట్టకూడదు. దీని గురించి స్పష్టమైన ఆదేశాలు ఉంటాయి. ఒక వేళ ఈసీ ఇచ్చిన గడువు కంటే ముందే ఎగ్జిట్ పోల్స్ బయట పెడితే.. అందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం జరిమానాలు, లేదా 2 ఏళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశాలు ఉంటాయి.
ఈ ఎగ్జిట్ పోల్స్ లో.. అసలు ఏ పార్టీ విజయం సాధించబోతుంది? ఓటమి పాలయ్యే పార్టీ ఏది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ప్రజలు ఎవరిని ఆదరించారు? అనే విషయాల గురించి బయటపెడతారు.
ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిందే జరుగుతుందా?
ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిందే జరుగుతుంది అని 100% చెప్పలేము కానీ.. గతంలో దాదాపు చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిందే జరిగింది. అందుకే ఎంతోమంది ఈ ఎగ్జిట్ పోల్స్ ని నమ్ముతారు.
కాగా ప్రస్తుతం ఏపీ ప్రజల్లో ఎగ్జిట్ పోల్స్ టెన్షన్ ఎక్కువగానే ఉంది. తుది విడత పోలింగ్ పూర్తయిన తర్వాత ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత రానున్న ఎగ్జిట్ పోల్స్ పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు.. అందుకే ఈ ఎగ్జిట్ పోల్స్ పై ముఖ్యంగా ఏపీలో ఎక్కువగా ఆసక్తి నెలకొంది.