HomeTelugu Newsపదిరోజుల్లోపు బెల్టుషాప్‌లు అన్ని తొలగించాలి

పదిరోజుల్లోపు బెల్టుషాప్‌లు అన్ని తొలగించాలి

15ఆంధ్రప్రదేశ్‌లో మద్యం బెల్టు షాపులను పూర్తిగాతొలగించాలని సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయంతో ఎక్సైజ్ శాఖ కార్యాచరణకు సిద్ధమవుతోంది. బెల్టు షాపులు ఎక్కడున్నా పదిరోజుల్లోపు తొలగించాలని ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ ముఖేశ్‌ కుమార్‌ మీనా అధికారులను ఆదేశించారు. విజయవాడ ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు కూడా హాజరయ్యారు.

బెల్టు షాపుల వెనుక ఎవరు క్రియాశీలకంగా ఉంటున్నారనే సమాచారం ఎక్సైజ్‌ సిబ్బందికి తెలియనిది కాదని.. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిబ్బంది అంతా గట్టిగా పనిచేస్తే బెల్టు షాపుల తొలగింపు అసాధ్యం కాదని కమిషనర్‌ ముకేశ్‌ కుమార్‌ మీనా అన్నారు. బుధవారం నుంచే నియంత్రణ మొదలు కావాలని.. ఏరోజుకి ఆరోజు ఎక్సైజ్‌ స్టేషన్ల వారీగా తీసుకున్న చర్యల నివేదికను కమిషనర్‌ కార్యాలయానికి పంపాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి గ్రామానికి ఒక కానిస్టేబుల్‌ను.. మండలానికి ఎస్సైని బాధ్యులుగా నియమిస్తామని, మద్యం బెల్టు షాపుల నియంత్రణలో నూరుశాతం ఫలితాలు సాధించిన సిబ్బందికి రివార్డులు అందజేసి సత్కరిస్తామని చెప్పారు.

కానిస్టేబుల్‌ నుంచి అడిషనల్‌ కమిషనర్‌ స్థాయి వరకు ఎవరు అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించబోమని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముకేశ్‌ మీనా హెచ్చరించారు. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిందేనన్నారు. ప్రతి గ్రామంలోనూ మద్యం బెల్టు షాపుల ఎత్తివేతకు సమావేశాలు నిర్వహించాలని, నిర్వాహకులకు కౌన్సెలింగ్‌ చేయాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని.. వాటిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని, దీన్ని పూర్తిగా అరికట్టాలంటే గంజాయి సాగులో లేకుండా చూడాల్సిన బాధ్యత అబ్కారీ శాఖపై ఉందన్నారు. వర్షాలు పడడానికి ముందుకు గంజాయి సాగు చేపట్టే అవకాశమున్నందున పండించకుండా చూడగలిగితే ఆ తరువాత ఎలాంటి ఇబ్బంది ఎదురుకాదని ముకేశ్‌ మీనా అధికారులకు వివరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu