AP elections 2024: ఏపీలో ఎన్నికల వేళ పలు చోట్ల ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు పోలింగ్ కొనసాగుతున్నా.. వైసీపీ ప్రలోభాల పర్వం మాత్రం ఆగడం లేదు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ అరాచకాలు దౌర్జన్యాలు తాజాగా వెలుగు చూశాయి.
యాదమరి మండలం కసిరాళ్ల ,కోడిగుట్ట పోలింగ్ కేంద్రాల బయట వైసీపీ ఓటర్లను మభ్యపెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్న వైనం చోటుచేసుకుంది. పూతలపట్టు మండలం సంజీవరాయని పల్లి పోలింగ్ కేంద్రంలోనూ ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఒకే ఒక్క పోలీసు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోతున్నాయి. ఎదిరిస్తున్న టీడీపీ శ్రేణులపై వైసీపీ కవింపు చర్యలకు పాల్పడుతోంది.
ఇక అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయిలో జనసేన ఏజెంట్ రాజారెడ్డిని వైసీపీ నేతలు అపహరించారు. పోలింగ్ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు లాక్కెళ్లిపోయారు. తమ ఏజెంట్‌ను కిడ్నాప్ చేశారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది.
ఇటు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోనూ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైలవరం దేవునిచెరువులో వైసీపీ, టీడీపీ శ్రేణులు బాహాబాహీకి దిగారు. వాలంటీర్‌లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. దీంతో టీడీపీ నాయకులతో వైసీపీ నాయకులు గొడవకు దిగారు. నేతల మధ్య తోపులాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు చెదరగొట్టేశారు.
వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు, కుటుంబ సభ్యులు దేవునిచెరువు పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చారు. ఓటర్ల క్యూ లైన్‌లో ఉన్న వార్డు మెంబర్‌ను పోలీసులతో చెప్పి తిరుపతిరావు బయటకు పంపించి వేశారు. తిరుపతిరావు కుటుంబ సభ్యులు క్యూ లైన్‌లో ఉన్న ఓటర్లను ఓట్లు అడుగుతున్నారని, వారిని పంపించివేయాలని పోలీసులను వార్డు సభ్యురాలు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన ఏసీపీ మురళీమోహన్.. వైసీపీ అభ్యర్థి తిరుపతిరావును అక్కడి నుంచి పంపించి వేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల మండలం కంభంపాడులో వైసీపీ- టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వివాదం జరిగింది. వైసీపీ శ్రేణులు గొడ్డళ్లు, వేట కొడవళ్లు, రాడ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావారణం నెలకొంది. భారీగా పోలీసు బలగాలను మొహరించారు. పరిస్థితిని ఐజీ శ్రీకాంత్ పర్యవేక్షిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో గల మల్లెవారిపల్లిలో టీడీపీ కార్యకర్త జడ రాంప్రసాద్‌పై వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. నంద్యాల జిల్లా ప్యాపిలి ఎస్సై జగదీశ్వర్ రెడ్డి రెచ్చి పోయారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణ మూర్తిపై చేయి చేసుకున్నారు. పోలీసు అధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
పలు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిల్చున్న ఓటర్ల దగ్గరకు వెళ్లి మరీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అడుగుతుండటం నివ్వెర పరుస్తోంది. పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ.. ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పలు చోట్ల వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎదురుతిరిగిన టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు.
శ్రీశైలంలో ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి బంధువులు హల్‌చల్ చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారంతా శ్రీశైలం కాలనీలో డబ్బులు పంచుతున్నారంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో అధికారపార్టీ నేతకు చెందిన ఎంఆర్ఎఫ్ షోరూమ్‌లో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తుండగా అడిషనల్ ఎస్పీ అశోక్‌బాబు సోదాలు చేసి అదుపులోకి తీసున్నారు. ప్రకాశం జిల్లా చెరువు మండలంలోని శతకోడు గ్రామంలో పోలింగ్ నిలిచిపోయింది. డబ్బులు తీసుకున్న ఓటర్ల ఓట్లను తామే వేస్తామంటూ వైసీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. దీనికి టీడీపీ నేతలు అడ్డు చెప్పడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. మరోవైపు దర్శి మండలం పెర్ర ఓబనపల్లి గ్రామంలో టీడీపీ ఏజెంట్లను బయటకు పంపి అధికారులు పోలింగ్ నిర్వహించారు. దీంతో వెంటనే పోలింగ్‌ను నిలిపివేసి, రీ పోలింగ్ జరపాలని టీడీపీ ఏజెంట్లు నిరసనకు దిగారు.
తెనాలి వైసీపీ అభ్యర్థి శివకుమార్ ఓటేసేందుకు క్యూ లైన్‌లో రావాలని చెప్పినందుకు.. ఓ ఓటరుపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు క్యూలైన్‌లో కాకుండా శివకుమార్ నేరుగా వెళ్తుండటంపై ఓటరు అభ్యంతరం తెలిపాడు. దీంతో ఆగ్రహించిన శివకుమార్ అతడిపై దాడి చేశారు. సహనం కోల్పోయిన ఓటరు కూడా అతడి చెంప చెళ్లుమనిపించాడు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. శివకుమార్ అనుచరులు ఓటరుపై విచక్షణారహితంగా దాడి చేశారు. అక్కడున్న పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర పోషించారు. ఈ ఘటనపై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
విజయవాడ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని బృందంపై వైసీపీ మూకలు రాళ్లతో దాడి చేశాయి. చిన్ని అనుచరులను వైసీపీ నాయకులు, కార్యకర్తలు అసభ్యపదజాలంతో దూషించారు. వాళ్లు దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని టీడీపీ ఆరోపిస్తోంది. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం దొండపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయులు వాహనాలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి.. మూడు వాహనాలను ధ్వంసం చేశారు.
డోన్ నియోజవర్గంలోని బేతంచెర్లలో స్వతంత్ర అభ్యర్థి పి.ఎన్. బాబుపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. బుగ్గన రాజేంద్రనాథ్ కారు వెనుక వెళ్తున్న పి.ఎన్.బాబు కారు అద్దాలను ధ్వంసం చేశారు. తమ వెంట రావొద్దంటూ పరుష పదజాలంతో హెచ్చరించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన పి.ఎన్.బాబు బేతంచర్ల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలం పుల్లూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గూడెం చెన్నయ్య అనే కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించి అతడికి చికిత్స అందిస్తున్నారు. వైసీపీ నాయకుడు నాగేశ్వర్‌రెడ్డి దాడి చేసినట్లు బాధితులు తెలిపారు.