AP elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ముందెన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల కొనుగోలు యథేచ్ఛగా సాగింది. వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్‌లు కిటకిటలాడుతున్నాయి. ఉత్సాహంగా ఓటు వేయడానికి అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు ఈ సారి పట్టణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతోంది. మాచర్ల, పుంగనూరు వంటి చోట్ల దాడులు జరిగినా పోలింగ్‌పై ప్రభావమైతే కనిపించడం లేదు. ఉదయం11 గంటలకే దాదాపు 25% పోలింగ్ నమోదైంది. ఓటింగ్ శాతం భారీగా పెరుగుతుండడంపై కూటమి శ్రేణుల్లో ఉత్సాహం చోటు చేసుకుంటోంది. ఊహించిన దానికంటే ట్రెండ్స్ తమకు పాజిటివ్ గా ఉన్నాయని కూటమి పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ- టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ ఓటర్ వైసీపీ ఎమ్మెల్యే చెంప పగలగొట్టడం గుంటూరులో చర్చనీయాంశం అయింది. తెనాలి వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ప్రస్తుత అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ క్యూలైన్లో నిలబడి ఓటు వేయకుండా.. నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఆయన్ని గమనించిన ఓ ఓటర్ లైన్లో నిల్చొని ఓటు వేయాలని సూచించారు.
ఆగ్రహానికి గురైన శివకుమార్ ఓటర్‌పై దాడికి దిగారు. ఓటర్ చెంప పగలగొట్టారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు ఓటర్‌ని చితకబాదారు. దీంతో సహనం కోల్పోయిన ఓటరు కూడా అతడి చెంప చెళ్లుమనిపించాడు. ఓటర్‌తోపాటు మిగతా వారు తిరిగి ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటనతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. అక్కడున్న పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర పోషించారు. ఈ ఘటనపై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.