AP Elections 2024: ఏపీలో ఎన్నికల ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపై ఉంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్డీయే కూటమి, మెగా ఫ్యామిలీ, అభిమానులు కష్టపడుతుంటే.. పవన్‌ను ఓడించడమే టార్గెట్‌గా పెట్టుకుని వైసీపీ నేతలు వ్యూహలు పన్నుతున్నారు. ఈ క్రమంలో జనసేనకు మద్దతు పెరుగుతోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ మద్దతు పెరుగుతోంది. పిఠాపురం బరిలో నిలిచిన పవన్ గెలుపు కోసం జబర్దస్త్ కమెడియన్లు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోలు పవన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటికే.. పవన్ కల్యాణ్ అభిమానులు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్‌తోపాటు పలువురు జబర్దస్ట్ ఆర్టిస్ట్‌లు పవన్ తరుపున ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు భార్య పద్మజా, వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పిఠాపురం తో పాటు పలు నియోజకవర్గాల్లో మెగా హీరోలు ప్రచారం ముమ్మరం చేశారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగారు. తన తమ్ముడిని గెలిపించాలంటూ ఈ వీడియో షేర్ చేశారు. ఇటీవల సీఎం రమేష్‌కు, పంచకర్ల రమేష్ మద్దతు పలికిన చిరంజీవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగారు. ఇప్పటివరకు బహిరంగంగా ఎవరికి మద్దతు అనే దానిపై చిరంజీవి స్పందించలేదు. తొలిసారి తన తమ్ముడి గెలిపించాలని పిఠాపురం ఓటర్లను చిరంజీవి కోరారు.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కూడా పవన కళ్యాణ్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవనకళ్యాణ్‌గారిని గెలిపించండి’ అని ట్విట్టర్ వేదికగా ఓటర్లను కోరారు.
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు హీరో నాని ఎక్స్ వేదికగా తెలిపారు. ‘పవన్ కళ్యాణ్‌గారూ.. మీరు పెద్ద రాజకీయ యుద్థాన్ని ఎదుర్కోనున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్న విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నా. మీ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా. మీకు ఎంతోమంది ప్రేమాభిమానాలు తోడున్నాయి. నా మద్దతు మీకే. ఆల్ ది బెస్ట్ సర్’ అని నాని ట్వీట్ చేశారు.
‘ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోసం మీ కృషిని, ప్రయత్నాలను మొదటి రోజు నుంచి చూస్తున్నాను. కోట్ల మందికి మీరు ఒక ఆశ. మీరు గెలిచి ప్రజల తలరాతలను మార్చాలని కోరుకుంటున్నాను. ఇప్పటి జనాలకు మీరు కావాలి’ అని హీరో రాజ్ తరుణ్ ఎక్స్ వేదికగా జనేసనకు సపోర్ట్ చేశారు.
నిర్మాత నాగవంశీ కూడా పవన్ కు మద్దతు పలికారు. ఈ రోజు సాయంత్రం ఆయన పిఠాపురం వెళ్లబోతున్నట్లు ట్వీట్‌లో తెలిపారు. ఆయన భారీ మెజారిటీతో గెలవాలని వంశీ అభిలషించారు.
“ఎన్ని అడ్డంకులు వచ్చినా .. ప్రజాపోరాటం నుంచి వెనక్కు తగ్గని మీ పోరాటపటిమ ఎప్పటికీ స్పూర్తి , రానున్న ఎన్నికలలో జనసేనానికి అన్ని శుభాలు జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను సదా మీ ప్రేమకి బానిస”
హనుమాన్ హీరో తేజ సజ్జా పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీ పెట్టారు. ‘త్వరలోనే మన అందరికీ ఓ బిగ్ డే రాబోతోంది.. పవన్ సర్ మమ్మల్ని గర్వపడేలా చేయండి’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.