AP Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. 6గంటల సమయానికి క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.
ఏపీలో వ్యాప్తంగా ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. గతంలో కంటే పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉండటంతో రాత్రి 10 గంటల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్ సమయం ముగిసే సరికి దాదాపు75 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. తుది పోలింగ్ శాతంపై మంగళవారం ఉదయానికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో అక్కడక్కడ ఘర్షణలు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై టీడీపీ వర్గీయులు దాడికి ప్రయత్నించారు.పోలీసులు స్పాట్ కు చేరుకొని రబ్బర్ బుల్లెట్లను పేల్చారు. అటు తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శివకుమార్ చెంప పగలగొట్టాడు ఓ ఓటరు. అదే సమయంలో ఎమ్మెల్యే అభ్యర్ధి అనుచరులు ఓటరను చితకబాదారు. ఈఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇక రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. అదే సమయంలో జిల్లా ఎస్పీ వాహనంపై కూడా రాళ్లు రువ్వారు.చిత్తూరు జిల్లా బైరెడ్డి పల్లిలో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపు రోడ్డుపై భైటాయించి నిరసన తెలిపారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో టీడీపీ అభ్యర్ధి కుమారుడి కారును ధ్వంసం చేశారు.దర్శిలో టీడీపీ, వైసీపీ వర్గాలు పోలింగ్ కేంద్రం దగ్గర ఘర్షణ పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎంటరై పరిస్థితిని చక్కదిద్దారు.బాపట్ల జిల్లా చీరాల, కంకటపాలెంలో ఘర్షణలు జరిగాయి. దీంతో పోలీసులు పిన్నెల్లి బ్రదర్స్ హౌస్ అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా ముస్తాబాద్, పెనలూరులో కూడా స్పల్ప ఘర్షణలు జరిగాయి.