AP Elections 2024: ఏపీ సీఎం జగన్ చెల్లెల్లు.. వైఎస్ షర్మిల, డాక్టర్ నర్రెడ్డి సునీతలు ఏకధాటిగా ప్రశ్నలు సంధిస్తూ జగన్‌కు ఊపిరి ఆడనివ్వడం లేదు. జగన్‌కు వాళ్లు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది కడప లోక్‌సభ నియోజకవర్గమే. ముఖ్యమంత్రి సొంత చెల్లెలే జగన్ మీద విస్తృతమైన ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. ఆమెకు తండ్రిని కోల్పోయిన బాధితురాలైన సునీత మద్దతుగా నిలుస్తున్నారు. వీరి దెబ్బకి జగన్ తన సతీమణి భారతిని రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఆమె ఇంటింటి ప్రచారం చేస్తూ అక్కడే ఉంటున్నారు. ఆమెకూ ప్రజల నుంచి నిరసనలు తప్పడం లేదు. మా పాస్‌పుస్తకంపై జగన్ బొమ్మ ఎందుకంటూ ఓ రైతు ప్రశ్నిస్తే ఆమె నోటి వెంట సమాధానమే లేదు. దానికి జవాబివ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కడప జిల్లాలో ఇన్నాళ్లూ ఎదురేలేదనుకున్నా జగన్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసును ఆయుధంగా మలుచుకుని జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రోజుకో అంశాన్ని ఎత్తుకుని మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రచారం చేస్తూ ఊరూరా, ఇంటింటికి తిరుగుతూ వణుకు పుట్టిస్తున్నారు.
1996 ఎన్నికల్లో వైఎస్ ఎలాగైతే బొటాబొటీ మెజారిటీతో గెలిచారో…ఇప్పుడూ అలాంటి పరిస్థితిని అవినాష్‌రెడ్డికి వారు తీసుకొస్తున్నారు. ఈ అక్కాచెల్ళెళ్లు లెవనేత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వారే లేరు. వైఎస్ అవినాష్‌రెడ్డి అడపాదడపా మాట్లాడుతున్నా…వాటిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. చివరికి జగనే రంగంలోకి దిగి పులివెందుల నడిబొడ్డున వైఎస్ అవినాష్‌రెడ్డి ‘చిన్న పిల్లాడు’ అంటూ వెనుకేసుకొచ్చారు. అయినా ఆ మాటలూ పనిచేయడం లేదు.
వైఎస్సార్ జిల్లాలో ఏ ఊరు, ఏ వీధిలోకి వెళ్లి ఏ గడపను అడిగినా వివేకాపై గొడ్డలి వేటు వేసింది ఎవరంటే కథలు కథలుగా చెబుతారు. ‘వివేకాను చంపింది ఎవరో వైఎస్సార్ జిల్లాలో గడప గడపకూ తెలుసు. ఎవర్ని అడిగినా తడబాటు లేకుండానే సమాధానం చెబుతారు. ఇక్కడ అదంతా బహిరంగ రహస్యమే’ అని బద్వేలుకు చెందిన ఓ వైసీపీ నాయకుడు చెప్పడమే దీనికి నిదర్శనం.
షర్మిల, సునీత మాట్లాడుతున్న మాటలు జగన్‌ను పిడుగుల్లా తాకుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటకీ వారు తూటాల్లా కౌంటర్ ఇస్తున్నారు. గత ఎన్నికల ముందు పలు హామీలిచ్చి తప్పడంపైనా మాటలతో చీల్చిచెండాడుతున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీ దగ్గర నుంచి గులకరాయి గాయం వరకూ ఏ విషయాన్నీ వారు వదలడం లేదు. బోనులో నిల్చోపెట్టినట్లు నిలదీస్తున్నారు. ఆమె ప్రచారంలో, ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడే మాటలు జగన్‌ను, ఆయన పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఇక అవినాష్‌రెడ్డికి నోట మాట రావడం లేదు. సమర్థించుకునే పరిస్థితి లేదు. ఎదురుదాడి అసలే లేదు. అండగా యంత్రాంగం లేకపోయినా….పార్టీ బలం లేకపోయినా షర్మిలకు తన గళమే బలం. ఇదే ఆమెను పోటీలో బలంగా నిలిపింది. ‘గెలుస్తుందో లేదో అనేది పక్కన పెడితే ఈ తరహా జగన్‌కు వణుకుపుట్టించిన వాళ్లు మళ్లీ వైఎస్ కుటుంబం నుంచే వచ్చారు’ అని పులివెందులకు చెందిన కొందరు స్థానికులు అంటున్నారు.
జగన్‌కు షర్మిల, సునీత సంధిస్తున్న ప్రశ్నలు నేరుగా ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఇది న్యాయానికి, నేరానికీ మధ్య జరుగుతున్న పోరాటమని వారు స్పష్టం చేస్తున్నారు. పులివెందుల పూలంగళ్ల వేదికగా బహిరంగ సభ నిర్వహించి ఇదే విషయాన్ని ప్రజల ముందు ఉంచుతూ కొంగు చాచి ఇద్దరు చెల్లెళ్లూ ఓట్లు అభ్యర్థించారు. ఇది వైఎస్ వివేకా అభిమానుల్లో కదలిక తెచ్చింది. ఆయన ద్వారా లబ్ధిపొందిన వారు జిల్లాలో ఊరూరా ఉన్నారు. చాలా మంది ఇప్పటికే ఎన్నికల్లో షర్మిలకు ఓటేయాలని నిర్ణయించుకున్నారు. పులివెందుల పట్టణ పరిధిలో ఎక్కువ మంది మహిళల్లోనూ ఇదే అభిప్రాయం వెల్లడవుతుంది.
కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పులివెందుల, కడప, ప్రొద్దుటూరు, బద్వేలులో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇదే జగన్‌కు గుబులు పుట్టిస్తోంది. సునీత పులివెందులలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.