Ap Elections 2024: ఏపీ ఎన్నికలు మరి కొద్ది రోజుల్లోనే జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీల ప్రచార హోరు ఆకాశాన్నంటుతోంది. అభ్యర్థుల తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పార్టీల అధినేతలు, ఇతర ముఖ్య నేతలు బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారపక్షం, విపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లిపోతోంది. వేసవి వేడితోపాటు ఏపీలో ఎన్నికల వేడి సుర్రుమంటోంది.
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యను అటు ప్రతిపక్షం, ఇటు విపక్షాలు రాజకీయంగా వాడుకుంటున్నాయనే చెప్పాలి. ఏ సభలో చూసినా వివేకా హత్య ఘటనను గుర్తుచేస్తూ పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వివేకాను హత్య చేయించింది జగనే అంటూ గొడ్డలి పోటుతో డ్రామాలు ఆడారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు సైతం టీడీపీ నేతలే ఆ హత్యకు కారణమంటూ ప్రత్యారోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు వైఎస్ షర్మిల సైతం తన చిన్నాన్నను జగన్, అవినాష్ రెడ్డి కలిసి చంపేశారంటూ.. హత్య చేసిన వారికి మళ్లీ టికెట్ ఇచ్చారని, అందుకే హత్యా రాజకీయాలు ఉండకూడదనే తాను పోటీ చేస్తున్నట్లు షర్మిల కూడా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు సైతం దీనిపై కలగజేసుకోవాల్సి వచ్చింది. వైఎస్ వివేకా హత్యకు సంబంధించి ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రాజకీయ నాయకులకు ఆదేశాలిచ్చింది.
తాజాగా వైఎస్ జగన్ కూడా పులివెందుల సభలో తన చిన్నాన్న వైఎస్ వివేకా హత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో నామినేషన్ వేసిన తర్వాత జరిగిన సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలు చేస్తూ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ వివేకాను ఎవరు చంపారో, ఎవరు చంపించారో పైన ఆ దేవుడికి తెలుసు, కింద ఈ జిల్లా ప్రజలకు తెలుసు అని అన్నారు. కానీ నాపై బురద చల్లేందుకు నా ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారి వెనుక ఎవరున్నారో రోజూ ప్రజలకు కనిపిస్తూనే ఉందంటూ చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు చేశారు.
చిన్నాన్న వివేకాను అతి దారుణంగా చంపేసిన వారికే మద్దతిస్తున్నారంటూ షర్మిలను, సునీతను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని సునీత, షర్మిలపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాని పార్టీ, రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ, రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ, వైఎస్‌ఆర్ పేరును ఛార్జిషీట్‌లో పెట్టిన కాంగ్రెస్‌కు ఓటు వేయడం ఎవరికి లాభం అంటూ షర్మిలపై ఆరోపణలు గుప్పించారు. ఓట్లు చీల్చి చంద్రబాబుకు లాభం చేకూరుస్తున్నారని.. ఇలాంటి వారా వైఎస్‌కు వారసులు అంటూ షర్మిలకు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ అవినాష్ తప్పు చేయలేదు కాబట్టే అతడికి సీటు ఇచ్చానని జగన్ అన్నారు.