AP elections 2024: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనుండగా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలపై చాలా ఆసక్తినెలకొంది. ఈక్రమంలో.. ఎన్నికల నేపథ్యంలో ఏపీలో 1,06,145 మంది సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని ఉదయం ఆరు గంటల నుంచి ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.
మరో పక్క పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలలో ఇద్దరు టీడీపీ ఏజెంట్లపై వైసీపీ వర్గాలు దాడి చేశారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారి స్థానంలో మరో ఇద్దరు ఏజెంట్లను అధికారులు అనుమతించారు. మాక్ పోలింగ్ పూర్తయిన తర్వాత.. రెగ్యులర్ పోలింగ్ ప్రారంభిస్తున్న క్రమంలో వైసీపీ ఏజెంట్లు టీడీపీ ఏజెంట్లపై దాడి చేశారు. పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే అదనపు బలగాలను తరలించేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించింది.
చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. వారిని పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది.
మరోవైపు అన్నమయ్య జిల్లా కేంద్రంలోని స్థానిక పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ కార్యకర్త సుభాష్ అనే టీడీపీ ఏజెంట్‌పై దాడి చేశాడు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేసి ఏజెంట్ ఫారాలు లాక్కెళ్లాడు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు వారిని చెదరగొట్టారు.
కాగా ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలు తమ ఓటు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉదయం ఓటు వేశారు. లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని గిరిజన కోపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి సతీమణితో కలిసి వచ్చారు. జనసేనాని రాకతో పోలింగ్ బూత్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. పవన్ ను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి కంట్రోల్ చేయడానికి, జనాలను అదుపు చేయడానికి సిబ్బంది అవస్థలు పడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ఉదయం 7.00 గంటలకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. నారా లోకేష్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన భార్య భారతీరెడ్డితో కలిసి కడప జిల్లా పులివెందులలోని భాకరాపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.