AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం హోరు మరికొన్ని గంటల్లోనే ముగియనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు ఎలాంటి ప్రచారాలు నిర్వహించకూడదు. సోమవారం పోలింగ్ ఉన్నందున సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి గడువు ముగియనుంది. ఆదివారం ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి అప్పగిస్తారు.. సాయంత్రానికి వారంతా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారు.
ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటలే సమయం ఉండటంతో జోరు వానను సైతం లెక్కచేయకుండా రాజకీయ నాయకులు తెగ కష్టపడుతున్నారు. తమ ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత కష్టపడినా ఇవాళ ఒక్కరోజే కదా అని వేటినీ లెక్కచేయకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలతో ఆఖరి ఘట్టంలో ప్రచారం పదును పెంచేశారు. ఎవరికి వారు తమదే గెలుపు అనే ధీమాలో ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ ప్రచారం చూసినా జనం మాత్రం బాగానే కనిపిస్తున్నారు. సభలకు జనాన్ని తరలించడంలో నాయకులు సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి. కానీ ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారో తెలియాల్సి ఉంది. సభలకు వచ్చే జనాన్ని చూసి నేతలు తమదే విజయమని భావిస్తున్నారు.
కూటమి మేనిఫెస్టో, తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారు. కూటమిదే విజయం అని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 160కి పైగా అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు గెలుస్తామనే ధీమాలో కూటమి అభ్యర్థులు ఉన్నారు. వైఎస్సార్సీపీ అరాచకాలను ఎండగడుతూ జగన్ పాలనలో జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు. కూటమి ప్రకటింటిన మేనిఫెస్టోను అభ్యర్థులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అలాగే వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతున్నాయి.
మరోవైపు వైసీపీ నేతలు కూడా తమదే విజయం అని ప్రచారం చేసుకుంటున్నారు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ బటన్ నొక్కడమే గానీ ప్రజలకు డబ్బులు అందడం లేదనే ఆరోపణలు ఉన్నప్పటికీ వాటిని కొట్టి పారేస్తున్నారు. జగన్ సభల్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు మావే అంటూ ప్రచారం చేస్తున్నారు.
ఆఖరి ఘట్టంలో సీఎం జగన్ మూడు సభల్లో పాల్గొనేందుకు ప్లాన్ చేశారు. ముందుగా ఇవాళ ఉదయం పల్నాడు జిల్లా చిలకలూరిపేట కళామందిర్ సెంటర్‌లో జరిగే సభకు హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఏలూరు జిల్లా కైకలూరు తాలూకా ఆఫీస్ సెంటర్‌లో సభలో పాల్గొంటారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ బస్‌స్టాండ్ సెంటర్‌లో జరిగే సభలో మధ్యాహ్నం తర్వాత పాల్గొంటారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నంద్యాలలో సభకు హాజరవుతారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి మధ్యాహ్నం నంద్యాల చేరుకుంటారు. అక్కడ స్థానిక రాజ్ థియేటర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన ప్రజా గళం సభలో పాల్గొంటారు. అనంతరం నంద్యాల నుంచి బయల్దేరి చిత్తూరు వెళతారు. అక్కడ ప్రజా గళం సభలో పాల్గొంటారు.. అనంతరం అక్కడి నుంచి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ ఇవాళ పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు. చరణ్ తన తల్లి సురేఖతో కలిసి ముందుగా పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆతర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇప్పటికే రామ్ చరణ్ బాబాయి పవన్‌కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి పవన్‌కు మద్దతు తెలుపుతూ వీడియోను కూడా విడుదల చేశారు. అలాగే పలువరు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పవన్‌కు మద్దతును ప్రకటించారు.