అన్ని పార్టీలు సాధారణ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి… రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని తమ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.. అయితే మరోవైపు సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఎన్నికలు ఆరేడు దశల్లో జరగనున్నట్లు ఈసీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. 16వ లోక్‌సభ పదవీకాలం జూన్ 3తో ముగియనుంది. ఈ లోపే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కావాల్సి ఉంది. దీంతో స్పీడ్ పెంచిన ఎన్నికల కమిషన్ మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలని భావిస్తోంది.
కాగా.. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీఈవోలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించిన ఈసీ ఫైనల్‌గా ఈ నిర్ణయానికొచ్చింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సీఈవోలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిపిన చర్చల్లో సమస్యలన్నీ కూడా ఓ కొలిక్కి తెచ్చే ప్రయాత్నాలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎంతమంది భద్రతా సిబ్బంది ఉన్నారు? వారిని వినియోగించుకుంటూ ఎన్ని దశల్లో పోలింగ్ నిర్వహించవచ్చు? అధికారుల మార్పులు, చేర్పులతో పాటు పలు అంశాలపై సమావేశంలో ఎన్నికల కమిషన్ చర్చించినట్లుగా తెలుస్తోంది.