AP Election 2024: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజాగళం’ లో భాగంగా పాతపట్నం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి? అని ప్రశ్నించారు. తాడేపల్లిలో కూర్చొని మీ తలరాతలు రాస్తాడా అని నిలదీశారు.
జగన్‌ని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్‌కు ఇదే చివరి ఛాన్స్ కావాలన్నారు. తనకు రాజకీయాలు కొత్త కాదని చెప్పారు. రాష్ట్రం గాడి తప్పిందని.. .రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. జగన్ పాలనలో విద్యుత్ చార్జీలు పెరిగాయని మండిపడ్డారు. మద్యపాన నిషేధం అన్నారని.. నాసిరకం మద్యం అమ్మకాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో జే.టాక్స్. గంజాయి సరఫరా పెరిగిపోయిందని ఆరోపించారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి అమ్మితే కఠిన చర్యలు తీసపుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.జాబు కావాలంటే బాబు రావాలని అది తన బ్రాండ్ అని… గంజాయి కావాలంటే జగన్ రావాలి…అది ఆయన బ్రాండ్ అని చంద్రబాబు సెటైర్లు గుప్పించారు.
తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి వాటా ఇవ్వకుండా.. అప్పు ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అని చంద్రబాబు విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రం, ప్రజలు నష్టపోయారన్నారు. రైతుల పొలాల్లో సర్వే రాళ్లపైనా జగన్ తన ఫొటో వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చుక్కల భూముల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి భూములు కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
దేశంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం కార్మికులే ఉంటారు. మేం అధికారంలోకి వచ్చాక స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. రాయితీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందిస్తాం. వ్యవసాయంలో ఆధునిక సాగు విధానాలు తెచ్చి.. రైతులకు ఖర్చులు తగ్గిస్తాం. ఐదేళ్లలో మీరు ఊహించని అభివృద్ధి చేసి చూపిస్తాం. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.
ఉద్యోగుల పెండింగ్ బకాయిలు ఇస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తాం. మేం వచ్చాక ఇంటి పన్నులు నియంత్రణ చేస్తాం. పాతపట్నం ప్రజలు కొత్త చరిత్ర రాసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో క్వీన్ స్వీప్ చేస్తున్నాం” అని చంద్రబాబు అన్నారు.