ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గోదావరి వరదలపై సమీక్ష నిర్వహించారు. బాధితులకు ఉదారంగా సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్… సహాయ కార్యక్రమాల్లో జాప్యం ఉండకూడదంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మూడు రోజుల్లో సాధారణ పరిస్థితులు వస్తాయని అధికారులు సీఎంకు వివరించారు. నిత్యావసర వస్తువుల పంపిణీ విషయంలో ఆలస్యం చేయొద్దని అధికారులకు స్పష్టం చేశారు ఏపీ సీఎం.. అయితే, ధవళేశ్వరం వద్ద ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇచ్చేటప్పటికే దేవిపట్నం మండలం ముంపు బారిన పడిందన్నారు అధికారులు.. గతంలో 2, 3 ప్రమాదస్థాయి హెచ్చరికలు దాటినప్పుడే ముంపునకు గురయ్యేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు… దీనిపై అధ్యయనం చేయాలని ఆదేశించారు సీఎం జగన్.. గడచిన 56 రోజుల్లోనే 500 టీఎంసీల జలాలు గోదావరి నది ద్వారా సముద్రంలోకి కలిసిపోయినట్టుగా అంచనా వేస్తుండగా.. వరద ప్రభానిత ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటించాలని సీఎం సూచించారు. అంటు వ్యాధులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు సీఎం వైఎస్ జగన్.