పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తారు విందు ఏర్పాటు చేసింది. గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి ఓటమిపాలైన వైసీపీ నేత ఇక్బాల్‌ను ఎమ్మెల్సీ చేస్తామని ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఐదుగురు ముస్లింలకు టికెట్లు ఇచ్చాం… నలుగురు గెలిచారు.. హిందూపురంలో మాత్రం ఇక్బాల్ ఓడిపోయారు.. ఆయనను ఎమ్మెల్సీని చేస్తామని హామీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.
వైసీపీ నుంచి సీఎం జగన్ ప్రకటించిన తొలి ఎమ్మెల్సీ ఇక్బాలే. మరోవైపు మాజీ సీఎం చంద్రబాబుపై జగన్ సెటైర్లు వేశారు ఏపీ సీఎం 23 మంది ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొనుగోలు చేసినా.. టీడీపీకి ఆ దేవుడు రాసిన రాత ఇది 23వ తేదీన ఫలితాల్లో 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారని ఎద్దేవా చేశారు. నాన్నగారి పాలన గుర్తుకు వచ్చేలా తన పాలన ఉంటుందని స్పష్టం చేశారు వైఎస్ జగన్.