ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్న సీఎం.. ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టారు. పూజా కార్యక్రమాలు, వేదపండితుల ఆశీర్వచనం అనంతరం కీలక దస్త్రాలపై సీఎం సంతకం చేశారు. ఆశా వర్కర్ల వేతనం రూ.10వేలకు పెంపు దస్త్రంపై మొదటి సంతకం, అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేకి ఏపీ నుంచి అంగీకారపత్రంపై రెండో సంతకం, జర్నలిస్టుల సమగ్ర బీమా దస్త్రంపై మూడో సంతకం చేశారు. ఇవాళ్టి నుంచి సచివాలయం కేంద్రంగా సీఎం జగన్ కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ముఖ్యసలహాదారు అజేయ కల్లం, డీజీపీ గౌతం సవాంగ్, మంత్రులుగా ప్రమాణం చేయనున్న ధర్మాన కృష్ణదాస్, కన్నబాబు, కొడాలి నాని, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు జగన్‌కు అభినందనలు తెలిపారు.