ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు. సచివాలయంలో పట్టణ, గ్రామీణ గృహ నిర్మాణంపై సీఎం సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో అక్రమాలు చోటు చేసుకున్నందున రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని అధికారులకు స్పష్టంచేశారు. వచ్చే ఏడాది ఉగాది నాటికి రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాల పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో ఇల్లు లేని పేద కుటుంబాలు ఉండకూడదని చెప్పారు.
గతంలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.1,100 వ్యయం అయితే.. దాన్ని రూ.2,300కు పెంచి దోచేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లను వేధించడం తమ ఉద్దేశం కాదని.. ఎవరిపైనా కక్షలేదని ఆయన స్పష్టం చేశారు. షేర్‌వాల్ టెక్నాలజీ పేరుతో పేదలపై భారం వేశారని జగన్ వ్యాఖ్యానించారు. పేదలపై ప్రతి నెలా రూ.3 వేలు భారం వేయటం సరికాదన్నారు. పేదలకు నష్టం రాకూడదని.. 20 ఏళ్లపాటు నెలానెలా కట్టే పరిస్థితి ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం అధికారులతో చెప్పారు.