HomeTelugu Newsజులై 1న జగన్ ప్రజాదర్బార్‌ ప్రారంభం

జులై 1న జగన్ ప్రజాదర్బార్‌ ప్రారంభం

9 28ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌.. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం సహా సత్వర పరిష్కారంపై దృష్టి సారించారు. దీనికోసం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. రోజూ ఉదయం గంటపాటు సామాన్య ప్రజలను కలిసి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.

జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక గుంటూరుజిల్లా తాడేపల్లిలో నివాసం ఉంటున్నారు. దీంతో ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు పెద్ద ఎత్తున అక్కడికి తరలివస్తున్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు సహా వివిధ రంగాలకు చెందిన వారు వీరిలో ఎక్కువగా ఉంటున్నారు. వ్యక్తిగత సమస్యలు, తమ ప్రాంత సమస్యలను పరిష్కరించాలని సామాన్య ప్రజలు సైతం వినతి పత్రాలతో వస్తున్నారు. వచ్చిన వారందరి నుంచీ నెలరోజులుగా ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు వినతులు తీసుకుంటున్నారు. చాలా మంది నేరుగా సీఎం జగన్‌ను కలిసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రజల విన్నపాలు తెలుసుకున్న సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.

జులై 1న ప్రజాదర్బార్‌ ప్రారంభానికి మహూర్తంగా నిర్ణయించారు. ఆలోపు తగిన ఏర్పాట్లు చేయాలన్న సీఎం ఆదేశాలతో ఇప్పటికే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యాంపు కార్యాలయం ప్రవేశమార్గం వద్ద ఓవైపు షెడ్డును నిర్మించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అక్కడ వేచి ఉండే అవకాశం కల్పిస్తారు. మంచినీటి సదుపాయం, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. జులై 1 నుంచి రోజూ ఉదయం 8గంటల తర్వాత గంట పాటు సీఎం జగన్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించి, స్వయంగా వారి సమస్యలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాతే సీఎం.. రోజువారీ అధికారిక కార్యక్రమాలు, శాఖాపరమైన సమీక్షల్లో పాల్గొంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు… హైదరాబాద్‌ బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్‌ను ప్రారంభించి కొనసాగించారు. ఆయన మార్గంలోనే ప్రజా దర్బార్‌ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్‌ నిర్ణయించి అమలు చేయబోతున్నారు. సీఎం నేరుగా ప్రజలను కలిసే కార్యక్రమం కావడంతో భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అదనంగా సిబ్బందిని నియమించడం సహా వచ్చిన వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపేందుకు స్కానర్లను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తగు సౌకర్యాలు కల్పించడంపై సీఎంవో అధికారులు దృష్టి పెట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu