దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల కోసం ప్రజలు ఒకేసారి ఇళ్ళలోంచి రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కరోనా నివారణకు సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశం దెబ్బతింటోందని అభిప్రాయపడ్డారు. దీంతో రైతు బజార్లను వికేంద్రీకరించడంతో రద్దీని తగ్గించవచ్చని నిర్ణయించారు. ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. నగరాలు, పట్టణాల్లో ప్రాంతాల వారీగా కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలన్నారు. కూరగాయలు, పాలు వంటి నిత్యావసరాలను వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. నిత్యావసరాల దుకాణాల వద్ద కూడా ప్రజలు దూరం దూరంగా నిలబడేలా మార్కింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూరగాయలు, నిత్యావసరాలు వీలైనంత త్వరగా
తీసుకోవాలన్నారు.
దుకాణాలకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అనుమతించాలని నిర్ణయించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 144 సెక్షన్ రోజంతా అమల్లో ఉంచాలన్నారు గూడ్స్ వాహనాలు, నిత్యావసరాలు తీసుకొచ్చే వాహనాల రాకపోకలకు అనుమతివ్వాలని నిర్ణయించారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలను కలెక్టర్లు నిర్ణయించాలని తెలిపారు. టీవీలు, పేపర్లలో ప్రకటించాలని ఆదేశించారు. ఎవరైనా ఎక్కువ ధరలకు విక్రయిస్తే 1902 కాల్ సెంటర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.