Homeతెలుగు Newsకేంద్రం తీరుపై కోపం, ఆవేశం, బాధ ఉన్నాయి: బాబు

కేంద్రం తీరుపై కోపం, ఆవేశం, బాధ ఉన్నాయి: బాబు

8 1బుధవారం చిత్తూరు జిల్లా కుప్పంలో జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబుకు ఆక్రోశం ఉందంటూ నిన్న ఏఎన్‌ఐ వార్తా సంస్థ ముఖాముఖిలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం మరోసారి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపట్ల తప్పకుండా తనకు కోపం, ఆవేశం, బాధ ఉన్నాయన్నారు. తన కోపానికి ప్రధాన కారణం మోడీ ప్రభుత్వం ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేయడమేనన్నారు. అందుకే కేంద్రంపై తాము పోరాటం చేస్తున్నామని, ఇప్పటివరకు 11 ధర్మపోరాట దీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాడతానని, వెనక్కి తగ్గే ప్రసక్తేలేదన్నారు. తాను చేస్తున్న పోరాటం తన కోసం కాదని, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసమేనన్నారు. తెలంగాణలో మహాకూటమి ఓడిపోవడంతో తాను ఆక్రోశంతో ఉన్నానని, దేశంలో పెట్టే మహాకూటమి విజయవంతం కాదని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి ఏం తెలియదు.. తప్పుడు లెక్కలు రాసి దొరికి పోవడం తప్ప అని సెటైర్లు వేశారు. ఇక జగన్ మెడ పై కేసుల కత్తి ఉందన్న ఏపీ సీఎం… కేంద్రం తలుచుకుంటే కేసులను తిరగ తోడుతుంది.. అందుకే ఆయన కేంద్రానికి లొంగిపోయారని వ్యాఖ్యానించారు. టీడీపీ అలాంటి బెదిరింపులకు ఎప్పుడూ లొంగదన్న చంద్రబాబు.. నా కుటుంబం కోసం నేను కష్ట పడటం లేదు.. వాళ్ల సొంత కాళ్లపై వాళ్లు నిలబడ్డారు.. అందుకే 24 గంటలు ప్రజల కోసమే పని చేస్తున్నానని వ్యాఖ్యానించారు.

దేశానికి మోడీ ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. ప్రమాదంలో పడిన దేశాన్ని కాపాడుకుంటూనే.. మరోవైపు రాష్ట్రానికి న్యాయం చేసుకోవాలన్నారు. అందుకే కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇటీవల తనపై అసభ్యంగా మాట్లాడారని అన్నారు. తన వద్ద మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడినా తాను ప్రజల కోసమే భరిస్తున్నానని చంద్రబాబు అన్నారు. పేదరికం లేని సమాజం చూడాలనేది తన జీవితాశయమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కేంద్ర సంస్థలను ఇవ్వలేదని, ద్రవ్యలోటును పూడ్చలేదని మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధుల్ని సైతం వెనక్కి తీసుకున్నారని దుయ్యబట్టారు. కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టమంటే, పెట్టమనే విధంగా కేంద్రం మాట్లాడితే తామే సాహసం చేసి పరిశ్రమను పెట్టుకొనేందుకు సిద్ధపడ్డామని చంద్రబాబు తెలిపారు. విశాఖ రైల్వేజోన్‌, దుగరాజపట్నం పోర్టు… ఇలా విభజన చట్టంలో పేర్కొన్న ఏ పనీ కేంద్రం చేయడంలేదని సీఎం దుయ్యబట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu