ఏపీ పర్యటనలో టీఆర్‌ఎస్ నాయకుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో మొక్కులకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా అని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ నేతలు ఏపీలో పర్యటిస్తే టీడీపీ నేతలు ఎవరూ పాల్గొనవద్దని సూచించారు. ఎవరైనా పాల్గొంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బంధుత్వాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి, స్నేహాలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి. బంధుత్వాలు, స్నేహాల పేరుతో పార్టీని పణంగా పెట్టొద్దని.. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయవద్దని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను సహించనని చంద్రబాబు స్పష్టం చేశారు.
“తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారు. ఇక్కడకొచ్చి అదే బీసీలపై కపటప్రేమ చూపుతున్నారు. 26 కులాలకు అన్యాయం చేసిన వారితో జగన్ అంటకాగుతున్నారు. టీఆర్‌ఎస్‌తో జట్టుకట్టిన వైసీపీకి 26 కులాల బీసీలే బుద్ధి చెప్పాలి. అవినీతి గొంగళి పురుగును కేసీఆర్ కౌగిలించుకున్నారు. అవినీతి గొంగళిపురుగుతో స్నేహం తెలంగాణ కోసమేనా? ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ జవాబు ఇవ్వాలి” అని చంద్రబాబు అన్నారు.