Homeతెలుగు Newsవిభజన చట్టంపై ఏపీ శ్వేతపత్రం విడుదల

విభజన చట్టంపై ఏపీ శ్వేతపత్రం విడుదల

8 19ఏపీపై కేంద్రం కావాలనే వివక్ష చూపుతోందని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హోదా అడిగితే తమపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో టీఆర్‌ఎస్‌ యూటర్న్‌ తీసుకుందని, అలాంటి పార్టీకి జగన్‌, పవన్‌ మద్దతిస్తారా అని ప్రశ్నించారు. హోదా అనేది తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, ఈ విషయంలో ధర్మపోరాటాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పారు. విభజన చట్టం, ప్రస్తుత పరిస్థితులపై ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. పదిరోజుల పాటు రోజుకో అంశంపై 10 శ్వేత పత్రాలు విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా తొలి శ్వేత పత్రాన్ని ఇవాళ విడుదల చేశారు. జన్మభూమి సభల్లో శ్వేతపత్రాలపై చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

‘రాష్ట్ర విభజనతో చాలా నష్టపోయాం. నిరాశలో ఉన్న రాష్ట్ర ప్రజల్లో మనోధైర్యాన్ని నింపా. విభజన చట్టాన్ని బీజేపీ అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. హోదా కోసం టీడీపీ ఎంపీలు వీరోచితంగా పోరాటం చేస్తున్నారు. విభజన చట్టం అమలులో మోసంపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. రాజ్యాంగంపై మోడీ ప్రభుత్వానికి నమ్మకం లేదు. 29 సార్లు నేను ఢిల్లీకి వెళ్లినా లాభం లేకుండా పోయింది. హోదా గురించి అడిగితే మాపై కక్ష కట్టారు. పైగా రాజధాని నిర్మాణానికి మట్టి, నీళ్లు ఇచ్చి మోడీ చేతులు దులిపేసుకున్నారు. పటేల్‌, శివాజీ విగ్రహానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి మాత్రం నామమాత్రంగా నిధులిచ్చారు. ఏపీపై కావాలనే కేంద్రం వివక్ష చూపిస్తోంది. పోలవరానికి ఇంకా చాలా నిధులు రావాలి. ఏపీ భవన్‌ ఆస్తుల విభజన జరగలేదు. తొమ్మిదో షెడ్యూల్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజన చేయలేదు. రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరాం. విభజన చట్టంలోని హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి చేశాం’ అని చంద్రబాబు అన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో టీఆర్‌ఎస్‌ యూటర్న్‌ తీసుకుంది. హోదా కోరుతూ కవిత కూడా పార్లమెంట్‌లో మాట్లాడారు. ఇప్పుడు మాట మార్చారు. దీనిపై కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. ఎన్నికల్లో వైసీపీ, జనసేన.. టీఆర్‌ఎస్‌కి మద్దతిచ్చాయి. ఆ పార్టీ గెలిస్తే ఏపీలో విపక్షం సంబరాలు చేసుకుంది. హోదాను వ్యతిరేకిస్తున్న టీఆర్‌ఎస్‌తో మీరు ఎలా కలుస్తారు’ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారని విమర్శించారు. తెలంగాణకు మనం ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. దేశానికి బీజేపీ వల్ల నష్టం జరుగుతోందని, ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హోదా అనేది తెలుగువారి ఆత్మగౌరవం, ఆంధ్రప్రదేశ్‌, భావితరాల భవిష్యత్‌కు సంబంధించిన విషయమని, ధర్మపోరాటాల ద్వారా ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu