మహిళల భద్రత కోసం కఠిన చట్టాన్ని తీసుకొస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ..ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా(సవరణ)చట్టం 2019, ఏపీ దిశ యాక్ట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అత్యాచారానికి పాల్పడినా, చిన్నారులపై లైంగికదాడికి పాల్పడినా ఈ చట్టం ప్రకారం మరణశిక్ష విధిస్తారు. నిర్ధరించే ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు వచ్చేలా బిల్లు రూపొందించారు. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు తీసుకొచ్చారు. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు, సోషల్ మీడియా ద్వారా మహిళలపై వేధింపులు తదితర నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగ్‌లు పెడితే చర్యలు తీసుకోనున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354(ఇ) కింద చర్యలు తీసుకునేలా బిల్లులో అంశాలు చేర్చారు. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే భారత నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ 354(ఎఫ్)కింద చర్యలు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మంత్రివర్గం నిర్ణయాలు…
* కాపు ఉద్యమం సందర్భంగా పెట్టిన అన్ని కేసులు ఎత్తివేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. తుని ఘటన సహా అన్ని కేసులు రద్దు చేయాలని, తుని ఘటనలో పెట్టిన కేసుల రద్దు కోసం కేంద్రానికి సిఫారసు చేయాలని నిర్ణయం.
* ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి చేస్తూ కేబినెట్ నిర్ణయం.
* రూ.3వేల కోట్ల రుణం తీసుకునేందుకు పౌరసరఫరాలశాఖకు అనుమతి.
* భోగాపురం విమానాశ్రయం భూసేకరణ సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తూ నిర్ణయం.
* ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే చట్టసవరణకు ఆమోదం తెలిపింది.
* రాజధాని భూముల్లో థర్డ్ పార్టీకి ఇచ్చిన భూములకు ప్లాట్ల కేటాయింపులు రద్దు చేసి, ఆ ప్లాట్లను తిరిగి అసైన్డ్ భూముల యజమానులకు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.