సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. చంద్రబాబు ‘రా కదలి రా’ పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ కూడా తన పాదయాత్రను పూర్తిచేసుకుని ఉన్నారు.
వీలు దొరికినప్పుడల్లా చంద్రబాబు, లోకేష్‌పై ఏపీ సీఎం జగన్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని గత ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతూ జగన్, వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈసారి ఏపీలో జరగబోయే ఎన్నికలు మాత్రం రసవత్తరంగా ఉండబోతున్నాయి. టీడీపీ-జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. వైసీపీ ఒంటరిగానే పోటీ చేయనుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో ఏమాత్రం ఉనికి లేని కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల రాకతో కాస్త ఊపిరి వచ్చినట్టయింది. ఏపీ కాంగ్రెస్ నేతల్లో సైతం జోష్ కనిపిస్తోంది.
ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే అయినా ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు చేపట్టాక ఆపార్టీకి కొత్త కళ వచ్చినట్టుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే వైసీపీ, టీడీపీ-జనసేన పార్టీలు విజయం తమదే అంటే తమదే అనే ధీమాలో ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పార్టీ నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
మరోవైపు బీజేపీ కూడా ఏపీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేంత సీన్ లేకపోయినా కొన్ని స్థానాలు అయినా దక్కించుకునేందుకు తన ప్రయత్నం తాను చేస్తోంది. అభ్యర్థుల ప్రకటనతో సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి కదన రంగంలోకి దూకింది. దానిలో భాగంగానే ఇవాళ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాలను ప్రారంభించారు. ఇవాళ భీమవరంలో పర్యటించి అక్కడ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా 25 పార్టీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు.
ఏపీలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి బీజేపీ ప్రణాళికలు వేస్తోంది. పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించిందో ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించింది. అయితే జనసేన పార్టీ మాత్రం ఇప్పటివరకూ బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ అది ఎన్నికల్లో ఎలా ఉంటుందా లేద అనేది ఇంకా తేల్చి చెప్పలేకపోతోంది. బీజేపీ మాత్రం జనసేనతో పొత్తు కొనసాగుతుందనే చెబుతోంది. అందువల్ల పొత్తులు, అభ్యర్థుల గురించి పట్టించుకోకుండా బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లాలని అడుగులు వేస్తున్నారు.