భారత్‌లో లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చాక వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలు ప్రకారం ఇవాళ 199 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. హైదరాబాద్ పరిధిలో 122 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2698కి చేరింది. తెలంగాణలో కరోనాతో ఇవాళ మరో ఐదుగురు మృతిచెందారు. దీంతో తెలంగాణలో కరోనాబారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 83కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 1428 మంది డిశ్చార్జి కాగా 1188 మంది చికిత్సపొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో లాక్‌డౌన్ జూన్ 7 వరకు పొడిగించినట్లు పభుత్వం వెల్లడించింది. కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం లాక్‌డౌన్ జూన్ 30 వరకు యధావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. ఈ మేరకు లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాల మధ్య రాకపోకలపై నిషేధం ఎత్తివేసింది. ఎలాంటి అనుమతి అవసరం లేదని వెల్లడించింది.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 9370 శాంపిల్స్ పరీక్షించగా 98 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 43 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా మరో ఇద్దరు మృతిచెందారు. ఇప్పటి వరకు ఏపీలో కరోనాబారిన పడిన వారి సంఖ్య 3042కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య మొత్తం 2135 కాగా, 62 మంది మృతిచెందారు. మరో 845 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు.