బాలీవుడ్ నటి, టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సతీమణి అనుష్కా శర్మ గర్భవతి అని వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. ఈ వార్తలపై ఆమె కాస్త ఘాటుగానే మాట్లాడారు. ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఆమె స్పష్టతనిచ్చారు.
‘పెళ్లయిన వెంటనే జనాలు అడగడానికి ఈ ప్రశ్నలు తప్ప మరేమీ ఉండవా? ఇలాంటి వార్తలు చదవడానికి కొందరికి ఉత్సాహంగా ఉంటుందేమో.. చెప్పడానికి పక్కవాళ్లకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఫలానా నటి డేటింగ్‌లో ఉందా? ఉంటే ఎవరితో? పెళ్లెప్పుడు? ఒకవేళ పెళ్లయితే తను గర్భవతా?వంటి ప్రశ్నలు అడుగుతుంటారు. నటులకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని, వాళ్లూ స్వేచ్ఛగా జీవించాలనుకుంటారని ఎందుకు అనుకోరు? ఇలాంటి వ్యవహారాలపై నేనెందుకు స్పందించాలి. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. పెళ్లయిన ఆడవాళ్లు వదులు దుస్తులు వేసుకుంటే వాళ్లు గర్భవతులనా? ట్రెండీగా ఉండటం కోసం వేసుకున్నారు అనుకోవచ్చు కదా!. ఇలాంటి వార్తలను విని ఊరుకోవడం తప్ప ఏం చేయలేం’ అని మాట్లాడారు.
విరాట్-అనుష్కల వివాహం 2017లో ఇటలీలోని టస్కనీలో వైభవంగా జరిగింది. అప్పటి నుంచి ఆమెపై ఇలాంటి వార్తలు ఎన్నో సార్లు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఆమె ఖండిస్తూనే వస్తున్నారు.