చలన చిత్ర రంగంలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. ప్రముఖ క్రీడాకారుల జీవిత చరిత్రలు వరుసగా తెరకెక్కుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ జీవిత చరిత్ర తెరకెక్కగా ఇప్పుడు టీమిండియా మహిళల జట్టు పేసర్ ఝలన్ గోస్వామి బయోపిక్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అనుష్క శర్మ నటిస్తున్నట్లు సమాచారం. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఝులన్‌తో కలిసి అనుష్క కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 38 ఏళ్ల ఝులన్ గోస్వామి 2002లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది. మహిళల క్రికెట్లో ఆమె దాదాపు రెండు దశాబ్దాలుగా రాణిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టే అవకాశముందని బాలీవుడ్‌లోని ఓ మ్యాగ్జైన్ కథనం ప్రచురించింది.