Anushka Sharma: విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. అనుష్క ఫిబ్రవరి 15న ఓ బాబుకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని 20వ తేదీన ప్రకటించారు అనుష్క దంపతులు. ఇంతకు ముందు ఈ జంటకు వామిక అనే పాప ఉండగా.. ఇప్పుడు బాబు జన్మించాడు. ఆ బాబుకి అకాయ్ అని పేరు పెట్టారు. ఈ పేరుకి చాలా ప్రత్యేకత ఉందంట. ఎంతో అంకిత భావంతో క్రికెట్ ఆడే కోహ్లి అనుష్క డెలివరీ కోసం ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.
అనుష్క శర్మ లండన్లో బిడ్డను ప్రసవించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ఎవరూ చెప్పలేదు గానీ.. అకాయ్ పుట్టడానికి కొద్ది వారాల ముందు అనుష్క, విరాట్ దంపతులు లండన్ వెళ్లారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రెగ్నెన్సీ సమయంలో అనుష్కకు సమస్యలు తలెత్తాయట. ఇండియాలోనే డెలివరీ చేయించుకుంటే.. హాస్పిటల్ ద్వారా వివరాలు బయటకు లీకయ్యే అవకాశం ఉండటంతో కోహ్లి దంపతులు డెలివరీ కోసం లండన్ వెళ్లారని టాక్.
అనుష్క డెలివరీ కోసం లండన్ వెళ్లిందనే విషయమై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా గతంలో హింట్ ఇచ్చారు. పుట్టబోయే బిడ్డ తండ్రిలా గొప్ప క్రికెటర్ అవుతాడా..? లేదా తల్లిలా సినీ స్టార్ అవుతాడా? అంటూ అనుష్క, కోహ్లి పేర్లను ప్రస్తావించకుండానే ఆయన రాసుకొచ్చారు. తన పోస్టులో మేడిన్ ఇండియా, టు బీ బోర్న్ ఇన్ లండన్ అనే హ్యాష్ ట్యాగ్‌లను ఆయన చేర్చారు.
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులకు 2021 జనవరి 11న వామిక జన్మించింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోహ్లి.. అనుష్క డెలివరీకి ముందు స్వదేశానికి తిరిగొచ్చి.. ప్రసవం సమయంలో భార్యకు తోడుగా ఉన్నాడు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిన తర్వాత కోహ్లి ఇండియాకు వచ్చేయడంతో.. అతడిపై విమర్శలొచ్చాయి. కానీ విరాట్ ముందే తన పెటర్నిటీ లీవ్ విషయాన్ని బీసీసీఐకి చెప్పాడు.
ఇప్పుడు కుమారుడు పుట్టిన సమయంలోనూ కోహ్లి తన భార్య పక్కన ఉండటానికే మొగ్గు చూపాడు. కాకపోతే ఏకంగా ఐదు టెస్టుల సిరీస్‌కు దూరంగా ఉండిపోయాడు. విరాట్ తొలి రెండు టెస్టులకు దూరం అవుతున్నాడని ముందుగా బీసీసీఐ ప్రకటించింది. కానీ ఆ తర్వాత సిరీస్ మొత్తానికీ దూరం అవుతున్నట్లు తెలిపింది. దీన్ని బట్టి చూస్తే.. అనుష్కకు ప్రెగ్నెన్సీకి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉన్నాయనే ప్రచారంలో నిజం అనిపిస్తుంది. అదలా ఉంచితే.. కోహ్లి దంపతులు తమ కొడుక్కి పెట్టిన పేరు అకాయ్. సంస్కృతంలో కాయ్ అంటే శాశ్వతమైనది, చిరంజీవి, పాడు కానిది అని అర్థం. కాయం, శరీరం. హిందీలో కాయ్ అంటే కాయం లేదా శరీరం. తుర్కిష్ భాషలో అకాయ్ అంటే.. నిండు చందమామ లేదా కాంతులీనుతున్న పున్నమి చంద్రుడు అని అర్థం.