ప్రముఖ నటి అనుష్క హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘నిశ్శబ్దం’. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాధవన్, అంజలి, షాలినీపాండే, సుబ్బరాజు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుదున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 31, ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మేరకు చిత్రబృందం హైదరాబాద్‌లో ఓ విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఇందులో భాగంగా దర్శకుడు హేమంత్ మాట్లాడుతూ.. ‘నేను, కోన వెంకట్ కలిసి ట్రావెల్ చేసే క్రమంలో విశ్వగారితో పరిచయమైంది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను ఏది అడిగినా.. ఆయన వెంటనే సమకూర్చారు. ఆయనలాంటి ప్రొడ్యూసర్ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. అనుష్క మూడు, నాలుగు నెలలు కష్టపడి సైన్ లాంగ్వేజ్, పెయింటింగ్ నేర్చుకున్నారు. అంజలిగారు ఇందులో కీలకపాత్రను పోషించారు. సుబ్బరాజు కూడా విభిన్న పాత్రలో కనపడతారు. జనవరి 31న ఈ సినిమాను విడుదల చేస్తాం. టెక్నికల్‌గా ఇదొక కొత్త చిత్రం. ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుందని నమ్ముతున్నాను.’ అని పేర్కొన్నారు.
అనంతరం నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘2017లో ఈ కథ హేమంత్ మధుకర్ రూపంలో నన్ను వెతుక్కుంటూ వచ్చింది. హేమంత్ చెప్పిన పాయింట్ విన్న నాకు అద్భుతమైన సినిమా అవుతుందనే ఫీలింగ్ కలిగింది. మొత్తం సినిమాను అమెరికాలోనే చిత్రీకరించిన తొలి తెలుగు సినిమా ఇదేనని అనుకుంటున్నాను. హాలీవుడ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాకు పనిచేశారు. మా టీజర్‌కు ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. ముందు ఈ సినిమాలో వేరే హీరోయిన్‌ను అనుకున్నాం. మాకు వీసాలు తదితర కారణాలతో సినిమా ఆలస్యమైంది. మేం అనుకున్న హీరోయిన్ డేట్స్ కుదరకపోవడం వల్ల ఈ సినిమాలో నటించనని చెప్పేసింది. ఒకసారి ముంబై నుండి వస్తున్న సమయంలో అనుష్క ఎయిర్‌పోర్ట్‌లో కనపడింది. మేం ప్రయాణించాల్సిన ఫ్లైట్ ఆలస్యమైంది. ఆ సమయంలో నేను అనుష్కకి ఈ కథ చెప్పాను. ఆమెకు ఈ కథ బాగా నచ్చింది. ఓ వారం గ్యాప్ తర్వాత తనను నేను మళ్లీ అప్రోచ్ అయ్యాను. అప్పుడు అనుష్క ఈసినిమాలో నటిస్తానని చెప్పింది. ఇందులో అనుష్క చేసిన సాక్షి అనే అమ్మాయి పాత్ర మాట్లాడలేదు. చెవులు వినపడవు. తన యాంగిల్‌లో కథ రన్ అవుతుంది కాబట్టే ఈ సినిమాకు ‘నిశ్శబ్దం’ అనే టైటిల్‌ను పెట్టాం.’ అని అన్నారు.