ప్రముఖ నటి.. అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమౌతున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జనవరి 31న విడుదల కాబోతోంది. దీని కోసం స్వీటీ తొలిసారి దివ్యాంగురాలి పాత్రను పోషించారు. కాగా ఈ సినిమా ప్రచారంలో పాల్గొనేందుకు అనుష్క సిద్ధంగా లేరట. మీడియా ముందుకొచ్చి మాట్లాడేందుకు ఆమె ఇష్టపడటం లేదని ప్రచారం జరుగుతోంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అనుష్క మీడియా గ్రూప్, సింగిల్ ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు సుముఖంగా లేరని సమాచారం. వ్యక్తిగత ప్రశ్నలకు దూరంగా ఉండేందుకు ఆమె ఇలా దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే సినిమా పబ్లిక్ ఫంక్షన్లకు, యూనిట్ సభ్యులతో కలిసి గ్రూప్ ఇంటర్వ్యూ వచ్చేందుకు ఆమె ఓకే చెప్పారట. చిత్ర బృందం ఏర్పాటు చేసిన యాంకర్‌కు ఇచ్చిన ఫీడ్‌ను మీడియాకు పంపిస్తారట. ఈ షరతుల వల్ల నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నట్లు వదంతులు వస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే అనుష్క స్పందించాల్సిందే.
అనుష్క గత చిత్రం ‘భాగమతి’ అద్భుత విజయం సాధించింది. మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రంగా విడుదలైనప్పటికీ బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబట్టింది. దీంతో అనుష్క స్టార్‌డమ్ మరోసారి నిరూపితమైంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’లో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్రలో అనుష్క మెరిశారు.